నిజామాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని అనడం హాస్యాస్పదమని అన్నారు. సిట్ విచారణ పేరిట నిందితుడిని సీఎం రేవంత్ రెడ్డి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఒక మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా.. పోలీసులు మూడు నెలలుగా ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. పోక్సో కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి.. ఆమెపైనే హనీట్రాప్ కేసు పెట్టడం దారుణమని మండిపడ్డారు. మైనర్ బాలిక హనీట్రాప్ చేస్తుందా అని ప్రశ్నించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని అర్థమవుతుందని అన్నారు.
బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని అర్థమవుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌ది ఫెవికాల్ బంధమని విమర్శించారు. వీళ్లిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారని, కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే కేంద్రమంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం మోపబడినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని అన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు.
పొద్దున లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీద విషం చిమ్మే బండి సంజయ్.. తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారని వేముల నిలదీశారు. తన కొడుకుపై వచ్చిన పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని.. ఈ కేసులో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేశారు.రాష్ట్ర పోలీసులు ఇప్పటికైనా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాన్ని గౌరవించాలని, బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు.