న్యూఢిల్లీ: ఇరాన్‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE Attack) రహస్యంగా సైనిక దాడులకు పాల్పడినట్లు తెలిసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్‌పై దాడిలో పాల్గొన్న మరో దేశంగా యూఏఈ నిలిచింది. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ దీనిపై ఓ కథనాన్ని రాసింది. కానీ ఇప్పటి వరకు ఈ దాడుల గురించి పబ్లిక్‌గా యూఏఈ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌లోని లావన్ దీవిలో ఉన్న ఆయిల్ రిఫైనరీపైన కూడా యూఏఈ అటాక్ చేసినట్లు ఆ రిపోర్టులో రాశారు. ఏప్రిల్ ఆరంభంలో ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇరాన్‌తో వార్ విషయంలో ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటించిన సమయంలో ఆ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.
గుర్తు తెలియని శత్రువు ఒకరు తమ దాడి చేశారని ఇటీవల ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ దాడికి ప్రతీకరంగా మిస్సైళ్లు, డ్రోన్లను యూఏఈ, కువైట్‌పై ఇరాన్ ప్రయోగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో చెప్పింది. ఆ నివేదిక ప్రకారం కేవలం లావన్ దీవిలో ఉన్న రిఫైనరీపై మాత్రమే యూఏఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ వార్ జరుగుతున్న సమయంలో ఆ దేశంపై గల్ఫ్ దేశాలు దాడి చేయలేదు. గల్ప్‌లో ఉన్న అమెరికా స్థావరాలను ఇరాన్ అటాక్ చేస్తున్నా.. ఆ దేశాలు మాత్రం ప్రతిస్పందించలేదు. రిఫైరీపై దాడి గురించి కామెంట్ చేసేందుకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. కానీ ఇరానీ దాడులను తిప్పికొట్టే అధికారం ఉన్నట్లు ఆ దేశం పేర్కొన్నది.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి చేస్తున్న సమయంలో.. యూఏఈపై ఇరాన్ భీకర దాడి చేసింది. ఆ దేశంపై సుమారు 550 బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లను రిలీజ చేసింది. సుమారు 2200 డ్రోన్లను ప్రయోగించినట్లు ఎమిరేట్స్ డిఫెన్స్ శాఖ చెప్పింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడికి గురైన ఏకైక దేశంగా యూఏఈ నిలిచింది. వార్ సమయంలో ప్రొజెక్టైల్స్తో యూఏఈపై ఇరాన్ దాడి చేసింది. అయితే వాటిని మిలిటరీ చాకచక్యంగా నిర్వీర్యం చేసింది.