Varanasi | ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ షూటింగ్ మొదలవుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లలో ఈ తాజా షెడ్యూల్ చిత్రీకరణ జరగనుంది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా యూనిట్ విదేశీ లొకేషన్లకు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కెన్యా, యూరప్‌తో పాటు మరికొన్ని అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను కేవలం ఇండియన్ మూవీగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని రాజమౌళి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ‘వారణాసి’ని పరిచయం చేసిన చిత్రబృందం.. త్వరలో ఫ్రాన్స్‌లో కూడా భారీ ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండబోతుందనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘వారణాసి’ కథ కూడా అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు సమాచారం. రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలను ఆధారంగా తీసుకుని.. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడి ప్రయాణంలా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథ వారణాసి నుంచి మొదలై కెన్యా, అంటార్కిటికా వరకు విస్తరించనుందట. ముఖ్యంగా రామాయణ యుద్ధం నేపథ్యంతో రూపొందిస్తున్న 25 నిమిషాల భారీ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యుద్ధ సన్నివేశం కోసం దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక నేటి నుంచి ప్రారంభమవుతున్న కొత్త షెడ్యూల్‌తో ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ మరింత వేగంగా ముందుకు సాగనుంది.