Vemual Prashanth Reddy | అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు లేదని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ గంటన్నర పాటు మాట్లాడడం శాసనసభ నిబంధనకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెబుతూనే.. మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని హరీశ్‌రావు అడిగారని.. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గంటన్నర పాటు మా సభ్యులపై అసభ్యంగా మాట్లాడటం దారుణమని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్పీకర్ అడ్డు చెప్పకుండా.. ప్రతిపక్షాలకు అవకాశం కల్పించకుండా చేయడం అన్యాయమని అన్నారు. ప్రతిపక్షానికి కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి తప్పులను ఎత్తిచూపేందుకు మైక్ ఇవ్వడం లేదని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్వయంగా స్పీకర్ చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మాకు మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం లాభమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడేందుకు కనీసం అవకాశం కల్పించడం లేదని.. అందుకే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో శాసనసభలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ సభ్యులు శాసనసభను బహిష్కరించారని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం శాసనసభ నిబంధనలకు విరుద్ధం అని కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క స్పీకర్ కు ఉత్తరం రాసి, సంతకాలు చేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వాళ్లే ప్రజెంటేషన్ ఇస్తున్నారని.. ఇది కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమని ఆరోపించారు. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా పీపీటీని వ్యతిరేకించారని.. ప్రస్తుతం కాంగ్రెస్ మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని అన్నారు. బీఆర్ఎస్ కు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్ కు ఉత్తరం రాశామని తెలిపారు. బీఆర్ఎస్కు పీపీటీ అవకాశం కల్పిస్తే సభకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ఇన్ని అవమానాలు జరగలేదని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వాదాన్ని కూడా అసెంబ్లీలో గట్టిగా చెప్పామని తెలిపారు. గతంలో శాసనసభకు కాలిన మోటార్లు, ఎండిన వరి పైరులు తీసుకెళ్లామని గుర్తుచేశారు.