కొండాపూర్ : ‘ఫ్యూచర్ సిటీ నిర్మాణం తర్వాత చేసుకోవచ్చు ముందు మాకు రోడ్డు వేయండి’ అంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ అపర్ణహిల్ పార్క్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియాల నివాసితులు శనివారం రోడ్డెక్కారు. మా ఇండ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డులేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలతో కలిసి ర్యాలీగా రోడ్డుపైకి వస్తేనన్న మా బాధలు అర్థం చేసుకుంటారని వేలాది మందితో అపర్ణ హిల్ పార్క్ నుంచి చందానగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించామన్నారు.
2023లో ఎమ్మెల్యే గాంధీ తమ సమస్యను అసెంబ్లీలో చర్చించడంతో సమస్య తీరుతుంది అనుకున్నామని, కానీ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడే తప్ప మా రోడ్డు పురోగతికి పయత్నించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని, ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మూస్తూ ప్యాచ్ వర్క్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం మంచిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
తాము కోట్లలో పన్నులు చెల్లిస్తున్నామని, సరైన వస్తతులు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై లేదా..? అని వారు ప్రశ్నించారు. గతుకుల రోడ్డుపై ప్రయాణించాలంటే భయంగా ఉందని, గర్భిణీలు ఈ రోడ్డు పై ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పనులు పూర్తి చేసి మా ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నామని తెలిపారు.