Bhudan Lands | ఖైరతాబాద్, మార్చి 6 : సంఘ సంస్కర్త ఆచార్య వినోబాభావే భూదానం ద్వారా ఇచ్చిన భూముల్లో పేదల కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎక్కడో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామనడం అమానుషమని.. కూల్చిన చోటే తక్షణం నిర్మించి ఇవ్వాలని పలువురు వక్తలు, వెలుగుమట్ల బాధితులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చి ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసిందని మండిపడ్డారు. భూవిముక్తి కోసం అనేక పోరాటాలు జరిగిన ఈ నేలను.. నేటి పాలకులు దందాల నేలగా మార్చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు.
తెలంగాణ సాయుధ పోరు కాలంలోనే వినోబాభావే భూదానోద్యమం చేసి ఇచ్చిన భూముల్లో నిరుపేదలు ఇండ్లు కట్టుకున్నారని, ఆ ఇండ్లను కూల్చిన ప్రభుత్వం తక్షణం అదే స్థలంలో నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి డీ విజయేందర్‌రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ జతిన్‌కుమార్ పాల్గొన్నారు.
మేం ఎన్నో ఏండ్లుగా భూదాన్ భూముల్లో ఉంటున్నం. ఇంట్లో వస్తువులను సర్దుకునే సమయం ఇవ్వకండా కట్టుబట్టలతో బయటకు వెళ్లగొట్టారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు. మేం పుట్టిన పెరిగిన ఆ కాలనీలో కాకుండా ఎక్కడో ఇళ్లు కట్టిస్తామంటున్నరు. మేమెక్కడికీ పోయేది లేదు.. ఇక్కడే ఇండ్లు కట్టియ్యాలె. మా కాలనీ వల్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు రేట్లు రావని కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేసి ఇండ్లు కూలగొట్టింది. చంటి పిల్లలకు తిండి, నిద్ర కరువైంది.
– నాగమణి, బాధితురాలు
ఉన్న ఇండ్లు కూలగొట్టిన్రు. అంబేద్కర్ భవన్లో తాత్కాలికంగా ఉన్న మమ్మల్ని పట్టించుకున్నోళ్లు లేరు. ఆ బిల్టిండ్లో 800మంది ఉంటున్నం. మగ, ఆడవారికి కలిపి రెండే బాత్రూమ్లు ఉన్నయ్. గంతమందికి అవి ఎట్ల సరిపోతయ్. మా గోస ఎవరికి చెప్పుకోవాలె. బాధితుల పక్షాన మాట్లాడుతున్నానని నన్ను జైలులో పెట్టిన్రు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వద్దకు తిప్పుతున్నరు. మా ఇందిరమ్మ ఇండ్లు అవసరం లేదు.. రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నం.. మాకు అదే జాగల ఇండ్లు కట్టించి ఇయ్యాలె.
– జయమ్మ, బాధితురాలు
మేం ఉంటున్న భూముల విస్తీర్ణం 62.7 ఎకరాలైతే.. 31 ఎకరాలు అని చెప్పాలట. అలా చెప్తేనే ఇండ్లు ఉంటాయని లేకుంటే మరిచిపోవాలని బెదిరిస్తున్నరు. మంత్రి తుమ్మల వెనుకుండి అనుచరులతో ఇదంతా నడిపిచ్చిండు. ఇండ్లలో ఉన్న వారందరిపై కేసులు పెట్టి.. అర్ధరాత్రి వచ్చి పోలీసులు పట్టుకపోయిన్రు. ఒక కేసు నుంచి బెయిల్ తీసుకుంటే మళ్లా ఇంకో ఫాల్తు కేసు పెట్టి జైళ్లో పెడుతున్నరు. అక్రమంగా ఇండ్లు కూలగొట్టి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మలపై కేసులు పెట్టాలె. మా భూములే ఆక్రమించుకోవాలని చూసిన ఆ మంత్రులు ముష్టోళ్లా.?
– అక్తరున్నీసా, బాధితురాలు