హనుమకొండ చౌరస్తా, మార్చి 25: కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025 లో పార్లమెంటులో ఆమోదింప చేసుకున్న పెన్షన్ వెలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ (ఎస్.జి.పి.ఎ.టి) రాష్ట్ర అధ్యక్షుడు జి.వీరస్వామి డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు ఇ.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెన్షన్ వాలిడేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షులు జి. వీరస్వామి, రాష్ర్ట ఉపాధ్యక్షులు టి. పురుషోత్తం, జిల్లా అధ్యక్షులు ఇ.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ చట్టం ద్వారా 1982లో శ్రీ వై.వి.చంద్రచూడు ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం డి.ఎస్.నకార వేసిన కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటివరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్ని కూడా 1-1-2026 నుంచి ఈ చట్టం ప్రకారం వర్తించవు అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోవడం చాలా దుర్మార్గమన్నారు.
ఈ చట్టం కనుక అమలైతే 31 డిసెంబర్ 2025 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్తులో పెన్షనుదారులకు పిఆర్సి కానీ డీఆర్లు కానీ వర్తించవు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఎస్టిఓ జనరల్ సెక్రెటరీ కందుకూరి దేవదాసు, ప్రధాన కార్యదర్శి కె.సమ్మారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్.ప్రకాష్, రత్నాకర్, సూర్యప్రకాష్, కమిటీ సభ్యులు సింగారెడ్డి, సత్యనారాయణ, రమేష్, జ్యోతి, రమణి, రాధ, సుభాషిని, రాజకొమురమ్మ, ఎల్.ప్రభాకర్‌రెడ్డి, కె.దేవదాసు, శ్యాంసుందర్‌రెడ్డి, ఆగయ్య, కె.భోగేశ్వర్, గఫార్, రాజేందర్, శ్యామ్‌రావు, కృష్ణమూర్తి, రాజయ్య పెన్షనర్లు పాల్గొన్నారు.