యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహా దివ్యసన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, కవచమూర్తులకు ఆరాధనలు జరిపించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలలో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. లక్ష్మీ నరసింహులకు దివ్య మనోహరంగా అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంలో జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. యాదాద్రి దర్శిని పేరిట మినీ బస్సులను ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొత్తం 25 బస్సులను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొండపైకి బస్సులు నడుస్తాయని వెల్లడించారు.
ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో స్వామివారి అద్దాల మండపం వద్ద అర్చకులు బుధవారం వేద ఆశీర్వచనం ప్రారంభించారు. రూ.600 టిక్కెట్‌తో గోత్రనామాల పేరిట అర్చనలు జరిపి, స్వామివారి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందిస్తారు. కేవలం వీవీఐపీ, వీఐపీలకు మాత్రమే ఆలయ సంప్రదాయరీతిలో వేద ఆశీర్వచనం ఇచ్చేవారు. సాధారణ భక్తులకు కూడా వేద ఆశీర్వచనం అందివ్వాలన్న సంకల్పంతో కొద్ది నెలల క్రితం బాలాలయంలో వేద ఆశీర్వచనం ప్రారంభించారు. అన్ని విభాగాల ద్వారా బుధవారం రూ. 10,58,774 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రి కొండకింద భక్తుల సందడి ప్రారంభమైంది. గండిచెరువు పక్కనే నిర్మించిన కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి గత నెల 28న అందుబాటులోకి రాగా.. భక్తులు తలనీలాలు సమర్పించి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సువిశాలమైన కల్యాణకట్టలో స్వామివారి మొక్కు తలనీలాలు సమర్పిస్తున్నారు. అనంతరం ఆ పక్కనే ఉన్న లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించి అనుభూతిని పొందుతున్నారు. విశాలమైన గుండం, స్వచ్ఛమైన నీటిలో భక్తులు స్నానాలు చేసి పరిసరాల్లో ఆనందంగా గడుపుతున్నారు.
స్వయంభూ లక్ష్మీనారసింహస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తన్మయత్వం పొందారు. స్వామివారి మహా దేవాలయాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు క్యూలో నిలబడి తనివితీరా ఆలయ నిర్మాణాలు చూస్తూ భక్తిభావంతో ఉప్పొంగిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. దర్శనం అనంతరం ప్రత్యేక కౌంటర్ల వద్ద స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. యంత్రాలతో నూతనంగా తయారు చేసిన ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 31,200
రూ. 100 దర్శనం టిక్కెట్ 1,900
వేద ఆశీర్వచనం 4,800
సుప్రభాతం 2,700
క్యారీబ్యాగుల విక్రయం 8,250
వ్రత పూజలు 44,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 16,200
ప్రసాద విక్రయం 7,38,120
వాహనపూజలు 5,000
టోల్గేట్ 880
అన్నదాన విరాళం 150
సువర్ణ పుష్పార్చన 78,600
యాదరుషి నిలయం 48,400
పాతగుట్ట నుంచి 20,500
గోపూజ 200
లీసెస్, లీగల్ 42,874