ఖమ్మం రూరల్, జూన్ 29 : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎంతో దూర దృష్టితో ఇండ్ల మధ్యల కోట్ల విలువైన భూముల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏదులాపురం మున్సిపాలిటీలో కనుమరుగు అవుతున్నాయి. చిన్నారుల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు గత కొద్ది రోజులుగా కూల్చివేతలకు గురవుతున్నాయి. ఇప్పటికే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు, ఒకటవ వార్డులలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలను సంబంధిత మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ లను బోర్డులను తొలగించారు. ఈ ప్రదేశాలలో నూతనంగా ఓపెన్ జిమ్, పార్కులను ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో బదులిచ్చారు.
అందుకు అనుగుణంగానే ఈ సంవత్సరం జనవరి నెలలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి దాదాపు ఆరు నెలలు కావస్తున్న నేటి వరకు నూతన నిర్మాణాల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉన్న నిర్మాణాలను జెసిబి లతో తీసేయడంతో గుంతలుగా ఏర్పడి క్రీడా మైదానాలు చిత్తడిగా మారిపోయాయి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉదయం సాయంత్రం వేళలో చిన్నారుల నుంచి ప్రతి ఒక్కరు ఎంతో సరదాగా ఆటలాడుకునే మైదానాలను కనుమరుగు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఏ మున్సిపాలిటీలోనైనా చైర్పర్సన్ వార్డు అంటే యావత్ ఇతర మున్సిపాలిటీ వార్డులకు ఆదర్శంగా ఉంటుందని చెప్పుకుంటారు. కానీ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్పర్సన్ వార్డులో తెలంగాణ క్రీడా ప్రాంగణం కనుమరుగై ఆరు నెలలు కావస్తున్న నేటి వరకు నూతన నిర్మాణం జరగకపోవడం విశేషం. సాక్షాత్తు మంత్రి శంకుస్థాపన చేసినప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్లు ఉంది పరిస్థితి. పైగా ఇటీవల కాలంలో కొందరు నాయకులు పార్కు బదులు కొత్త భవనం ఏర్పాటు కాబోతుందని ప్రచారం చేయడం మరిన్ని విమర్శలకు తావిస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్కటిగా క్రీడా ప్రాంగణాలను అధికారులు కూల్చివేయడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వాటిని బుల్లోజర్లతో తొలగించడం సరికాదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకొని చర్యలు చేపట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.

కనుమరుగవుతున్న క్రీడా ప్రాంగణాలు