Work | ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలనే తపన, ఖాళీగా కూర్చుంటే అసహనం లేదా అపరాధ భావన కలగడం చాలా మంది తమ కష్టపడే స్వభావంగా భావిస్తుంటారు. అయితే ఇది కేవలం పనిపట్ల అంకితభావం మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఒత్తిడి (క్రానిక్ స్ట్రెస్) వల్ల మెదడులో ఏర్పడిన మార్పుల సంకేతం కూడా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువకాలం ఒత్తిడిలో జీవించడం వల్ల మెదడు విశ్రాంతిని కూడా ప్రమాదంగా భావించే పరిస్థితికి చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు. శరీరంలోని సింపథటిక్ నర్వస్ సిస్టమ్, హెచ్పీఏ (హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్) వ్యవస్థ ఒత్తిడి సమయంలో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి శరీరాన్ని అప్రమత్తంగా ఉంచి ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయి. అయితే ఈ వ్యవస్థలు ఎక్కువకాలం నిరంతరం చురుకుగా ఉంటే, నిజంగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా మెదడు ప్రతి పరిస్థితినీ ప్రమాదంగానే భావించడం ప్రారంభిస్తుంది. ఫలితంగా శరీరం ఎప్పుడూ అప్రమత్త స్థితిలోనే ఉంటుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శరీరం సాధారణంగా శ్రమ, విశ్రాంతి మధ్య ఉండాల్సిన సమతుల్యతను కోల్పోతుంది. పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన సహజ ప్రక్రియ దెబ్బతిని, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలనే భావన పెరుగుతుంది. కాలక్రమేణా నిరంతరం చురుకుగా ఉండటమే సురక్షితమనే అభిప్రాయం మెదడులో బలపడుతుంది. ఎక్కువకాలం ఒత్తిడిలో ఉండడం వల్ల భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో బిజీగా ఉండటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం, నియంత్రణలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఫలితంగా ఉత్పాదకత (ప్రొడక్టివిటీ) కేవలం పని చేసే అలవాటు కాకుండా, ఒత్తిడిని తట్టుకునే ఒక మార్గంగా మారుతుంది.
మెదడు ఎప్పుడూ ఉద్దీపనకు అలవాటు పడిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఖాళీగా ఉన్న సమయంలో ఆందోళన, అపరాధ భావన కలగడం, ఏదో ఒక పని, వినోదం లేదా ఇతర వ్యాపకాలతో సమయాన్ని గడపాలని అనిపించడం సాధారణంగా కనిపించే లక్షణాలుగా చెబుతున్నారు. అందువల్ల విశ్రాంతి తీసుకోవడానికే కొందరు ఇబ్బంది పడుతుంటారు. ప్రతి పనిని పూర్తి చేసినప్పుడు కలిగే సంతృప్తి, ఉపశమనం కూడా ఒక చక్రంలా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పని చేస్తున్నప్పుడు ఆందోళన తగ్గి, విశ్రాంతి సమయంలో మళ్లీ పెరుగుతుంటే, మెదడు ఎప్పుడూ పని చేస్తూ ఉండటాన్నే ఒత్తిడిని తగ్గించే మార్గంగా గుర్తుంచుకుంటుంది. దీంతో నిరంతరం బిజీగా ఉండాలనే అలవాటు మరింత బలపడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం, ఒత్తిడిని తగ్గించే జీవనశైలి మార్పులు చేసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.