Canal Missing | ఝరాసంగం, జూన్ 29 : చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని.. అవసరమైతే ‘హైడ్రా’ వంటి వ్యవస్థలతో కూల్చివేతలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వెంచర్ నిర్వాహకుల బరితెగింపు తగ్గడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ఉన్న వరద నీటి కాల్వను యథేచ్ఛగా కబ్జా చేసి, దానికి అడ్డంగా ఏకంగా భారీ గోడనే నిర్మించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక అధికారుల పర్యవేక్షణా లోపం, ఆక్రమణదారులకు కొందరు అధికారుల సహకారం పుష్కలంగా ఉండటం వల్లే ఈ అక్రమ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అలుగు కాల్వను మింగేశారు..!
పొట్టిపల్లి గ్రామ రికార్డుల ప్రకారం.. గ్రామంలోని చెరువు కట్ట, శిఖం భూమి పరిధిలో 27 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరంతా ఈ చెరువు అలుగు మీదుగా ప్రవహిస్తూ.. పొట్టిపల్లి శివారులోని సర్వే నంబరు 71 గుండా వెళ్లి, అల్గోల్ వద్ద నారింజ వాగులో కలుస్తుంది. అయితే ఈ సర్వే నంబరు పరిధిలో ఫామ్‌ల్యాండ్ పేరిట వెంచర్ వేసిన నిర్వాహకులు.. వరద నీరు వెళ్లే సహజ సిద్ధమైన కాల్వను పూర్తిగా కబ్జా చేశారు. ప్రవాహానికి అడ్డంగా గోడ కట్టేయడంతో కాల్వ ఉనికి ప్రమాదంలో పడింది.
పొలాలపైకి వరద ముప్పు..
కాల్వను మూసివేయడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున చెరువు నుంచి వచ్చే ఉధృతమైన వరద నీరు ముందుకు వెళ్లే మార్గం లేక వెనక్కి తన్నుతుందని.. ఫలితంగా సమీపంలోని సాధారణ రైతుల పొలాలన్నీ జలమయమై పంట నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఆక్రమణలు నిజమైతే చర్యలు : శ్రీలత, ఇరిగేషన్ ఏఈ
పొట్టిపల్లి శివారులో వరద కాల్వ ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది. గ్రామస్థుల ఫిర్యాదుపై ఇప్పటికే స్పందించాం. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సదరు సర్వే నంబరులో కాల్వ సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు సర్వేయర్‌ను కోరాం. సర్వే నివేదికలో ఆక్రమణలు జరిగినట్టు తేలితే.. ఫామ్‌ల్యాండ్ నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

Canal Missing1