Rupee | ముంబై, నవంబర్ 8: దేశీయ కరెన్సీ విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ట్రేడవడంతో మారకంపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వరుసగా మూడోరోజూ శుక్రవారం కూడా 5 పైసలు నష్టపోయి రికార్డు స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్-రుఫీ ఎక్సేంజ్ రేటు 84.37కి జారుకున్నది. 84.32 వద్ద ప్రారంభమైన డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక దశలో 84.31 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇంట్రాడేలో 84.38 కనిష్ఠ స్థాయిని తాకిన విలువ చివరకు ఐదు పైసల నష్టంతో 84.37 వద్ద ముగిసింది. గురువారం మారకం విలువ ఒక్క పైసా నష్టపోయిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా మూడు సెషన్లలో రూపాయి విలువ 28 పైసలు నష్టపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పతనమవడం కూడా రూపాయి పతనానికి ఆజ్యం పోశాయని బీఎన్పీ పరిబాస్ రీసర్చ్ హెడ్ అనూజ్ చౌదరీ తెలిపారు.
దెబ్బతీసిన ఫెడ్ నిర్ణయం
అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురయ్యాయని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్..పన్ను, వాణిజ్య విధానాలు గ్లోబల్ ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేస్తాయోమోననే ఆందోళనలు నెలకొన్నాయని, అందుకే రూపాయి ఒడిదుడుకులు లోనవుతుందన్నారు. గతవారంలో పావు శాతం వడ్డీరేట్లను తగ్గించిన ఫెడ్..వచ్చే సమీక్షలోనూ ఇంతే స్థాయిలో తగ్గించే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు ఫారెక్స్ మార్కెట్లో ప్రకంపనాలు సృష్టించింది. బ్యారెల్ క్రూడ్ ధర 1.10 శాతం తగ్గి 74.80 డాలర్లకు చేరుకుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.3,404 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
మరింత కరిగిన విదేశీ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు తగ్గిపోవడంతో నవంబర్ 1తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.67 బిలియన్ డాలర్లు తరిగిపోయి 682.13 బిలియన్ డాలర్లకు తగ్గాయని ఆర్బీఐ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 3.463 బిలియన్ డాలర్లు తగ్గి 684.805 బిలియన్ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ చివరినాటికి రికార్డు స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఫారెక్స్ రిజర్వులు ఆ మరుసటి నుంచి దిగువముఖం పట్టాయి. గత వారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.902 బిలియన్ డాలర్లు తగ్గి 589.849 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్‌తోపాటు ఇతర కరెన్సీలు యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు పతనం చెందడం ఇందుకు కారణమని తెలిపింది. కానీ, పసిడి రిజర్వులు 1.224 బిలియన్ డాలర్లు పెరిగి 69.751 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.