న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా 14 ఏళ్ల ఆ క్రికెటర్ అవార్డును స్వీకరించారు. ఢిల్లీలో ఇవాళ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బాల పురస్కారాన్ని ప్రతి ఏడాది అందజేస్తారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవార్డు స్వీకరించే క్రమంలో క్రికెటర్ వైభవ్ ఇవాళ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. వాస్తవానికి బీహార్, మణిపూర్ మధ్య ఇవాళ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ జరుగుతున్నది. కానీ ఆ మ్యాచ్‌లో వైభవ్ ఆడడం లేదు.
5 నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి బాల్ పురస్కారాలు అందజేస్తారు. వైభవ్‌తో పాటు మొత్తం 19 మంది పిల్లలకు వివిధ రంగాల్లో అవార్డులను అందజేయనున్నారు. మీరు సాధించిన ఘనత యావత్ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని, ఇవాళ గుర్తింపు పొందిన ప్రతి చిన్నారి చాలా ముఖ్యమైన , విలువైన వ్యక్తులు అని, అలాంటి నైపుణ్యం ఉన్న పిల్లల వల్లే ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు వస్తున్నదని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రెండు రోజుల క్రితం అరుణాచల్ ఫ్రదేశ్తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 190 రన్స్ ఛేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో అతను మళ్లీ విజయ్ హజరే మ్యాచ్‌లను ఆడేది అనుమానంగాఉన్నది. ఆ యువ క్రికెటర్ అండర్19 జట్టుతో జతకలవనున్నాడు. జనవరి 15వ తేదీ నుంచి అండర్19 వరల్డ్‌కప్ జరగనున్నది. ఆ ప్రిపరేషన్ కోసం అతను విజయ్ హజారే ట్రోఫీ మిస్సయ్యే అవకాశాలు ఉన్నాయి.