గ్యాంగ్టక్, జూన్ 13: భారీ వర్షాలకు కొండచరియలు కూలిపడి సిక్కింలో ఆరుగురు మరణించగా, 1,500 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని మాంగన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్దయెత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. సంగ్కలంగ్లో ఇటీవల కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి కూలడంతో మంగన్, డిజాంగ్, చుంగ్తాంగ్ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లకు అడ్డంగా బండరాళ్లు పడి మూసుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గురుదాంగ్మార్ లేక్, యుంతంగ్ వ్యాలీలతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రాంతాల్లో వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కిం ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.