న్యూఢిల్లీ: గతేడాది ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు ఎక్కువగా జరిగాయి. దేశవ్యాప్తంగా 30,864 ఫిర్యాదులు రాగా.. అందులో అత్యధికంగా 15,828 ఫిర్యాదులు కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చాయని జాతీయ మహిళా కమిషన్ గణాంకాలు చెప్తున్నాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ (3,336), మహారాష్ట్ర (1,504), హర్యానా (1,460), బీహార్ (1,456) నిలిచాయి. ఈ 30,864 ఫిర్యాదుల్లో 11,013 ఫిర్యాదులు మహిళలను కించపర్చడం, వారి గౌరవానికి భంగం కలిగించినవే. గృహ హింసకు సంబంధించి 6,633, వరకట్నం వేధింపులకు చెందినవి 4,589 ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే 2020లో ఇలాంటి ఫిర్యాదులు 23,722 రాగా.. 2021లో దాదాపు 30 శాతం పెరిగాయి. అంతేగాక 2014 తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో ఫిర్యాదులు రావడం కూడా ఇదే తొలిసారి.