హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, పునర్విభజన చట్టాలను సైతం ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. ట్రిబ్యునల్ అనుమతించిన 80 టీఎంసీలకు మించి అదనంగా ఒక్క చుక్క నీటిపై కూడా ఏపీకి హకు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తేల్చిచెప్పారు.
ఏపీ సర్కార్ రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు పూనుకున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇతర కేంద్ర సంస్థలకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశామని మంత్రి పేర్కొన్నారు. నదీజలాల వాటా విషయమై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఉత్తమ్ ఖండించారు. తెలంగాణ నీటి హకుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు.