కోల్‌కతా, డిసెంబర్ 31: చనిపోయాడని భావించిన ఓ వృద్ధుడు మూడు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని తన స్వగ్రామం ఖటోలీకి తిరిగివచ్చాడు. అనేక ఏండ్లుగా పశ్చిమ బెంగాల్లో స్థిరపడిపోయిన ఆ వృద్ధుడిని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) స్వగ్రామానికి తిరిగి రప్పించింది. భార్య మరణించిన తర్వాత 1997లో షరీఫ్ అహ్మద్(79) అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత రెండవ వివాహం చేసుకుని పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డాడు. సర్ ప్రక్రియ కోసం ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటిని సేకరించుకునేందుకు డిసెంబర్ 29న షరీఫ్ తన స్వగ్రామం తిరిగివచ్చాడు.
మూడు దశాబ్దాలుగా ఆచూకీ లేకపోవడంతో తమ తండ్రి మరణించాడని షరీఫ్ నలుగురు కుమార్తెలు భావించారు. పిల్లలు ఉన్నారన్న విషయం కూడా మరచిపోయి రెండో భార్య, పిల్లలతో బెంగాల్లో గడిపేస్తున్న షరీఫ్‌కి హఠాత్తుగా సర్‌తో నెత్తిమీద పిడుగుపడినట్లయింది. తన పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా అవసరం కావడంతో తన పాత బంధాలను అతను పునరుద్ధరించుకోక తప్పలేదు. తండ్రిని చూసి ఆయన కుమార్తెలు సంతోషించి భావోద్వేగానికి గురయ్యారు. వచ్చిన పని పూర్తి చేసుకుని షరీఫ్ పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాకు బయల్దేరి వెళ్లిపోయాడు.