(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్‌మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్‌మీటర్’ ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని నిపుణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. బీజేపీపాలిత ఒడిశాలోనూ స్మార్ట్‌మీటర్ ప్రాజెక్టు జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతున్నది. రైతుల పొలాల దగ్గర, సామాన్యుల ఇండ్లల్లో స్మార్ట్‌మీటర్ల ఇన్‌స్టాలేషన్‌ను అక్కడి ప్రభుత్వం వడివడిగా పూర్తి చేస్తున్నది. ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్మార్ట్’ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ నేతలు, బిజూ జనతాదళ్ (బీజేడీ) నాయకులు గత వారం రోజులుగా నిరసన ప్రదర్శనలు ఉద్ధృతం చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ ఆందోళనలపై ప్రభుత్వం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు కోర్టుకెక్కారు.
రైతులు, సామాన్యుల అభిప్రాయాలను తీసుకోకుండానే పొలాల్లో, ఇండ్లల్లో స్మార్ట్‌మీటర్లను బలవంతంగా బిగించారని ఒడిశా కాంగ్రెస్ నేతలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో రైతులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. స్మార్ట్‌మీటర్లను చూపించి ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట రైతులు, సామాన్యుల నుంచి వేల రూపాయలను దండుకొంటున్నారని మండిపడ్డారు.
మీటర్లు బిగించినప్పటి నుంచి రైతులకు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆరోపించారు. ఒడిశా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఓఈఆర్‌సీ) చట్టం, విద్యుత్తు సరఫరా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ‘స్మార్ట్’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్మార్ట్‌మీటర్లను బిగించిన టాటా పవర్ సెంట్రల్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీసీఓడీఎల్), రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. స్మార్ట్‌మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీజేడీ నేతలు కూడా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు ఉద్ధృతం చేశారు.
ఒకవైపు స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా ఒడిశా కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లెక్కి మరీ నిరసనలను ఉద్ధృతం చేస్తుంటే, మరోవైపు తెలంగాణలో అన్నదాతల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. వచ్చే ఏడాది దాదాపు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు ఇన్స్టాల్ చేయాలని కుట్రలకు తెగబడుతున్నది. రేవంత్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, గత కేసీఆర్ ప్రభుత్వం స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించి.. రైతులకు అండగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు. స్మార్ట్‌మీటర్ల విషయంలో ఒడిశాలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉన్న కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.