VLF Radar | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్ వంటి దేశాలే వీఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేయడం వివాదంగా మారింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఉడ్‌సైడ్ ఒమేగా అనే వీఎల్ఎఫ్ రాడార్‌ను 2015లో అక్కడి ప్రభుత్వం బాంబులు పెట్టి మరీ పేల్చివేసింది. అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఎన్ఏఏ ఆర్లింగ్టన్ రాడార్‌ను, మేరీలాండ్‌లోని అన్నాపోలీస్ ఎన్ఎస్ఎస్ రాడార్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. స్థానికులు, పర్యావరణవేత్తల నుంచి వస్తున్న విమర్శలతోపాటు సాంకేతిక సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి ప్రభుత్వాధికారులు చెప్తున్నారు. ఈ రాడార్ల ఇన్‌స్టాలేషన్‌తో స్థానికుల్లో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రమాదం ఉన్నదా?
వీఎల్ఎఫ్ రాడార్ అంటే ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ రాడార్ అని అర్థం. ఈ వీఎల్ఎఫ్ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గ్గాముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 3 కేజీహెచ్జెడ్ నుంచి 30 కేజీహెచ్జెడ్ రేంజ్లో తరంగాలను ప్రసారం చేస్తారు. నీటిలో 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు ప్రసరించగలవు. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా సిగ్నల్స్ చేరవేయగలవు. వీఎల్ఎఫ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ తరంగాల కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్యాన్సర్, గుండెజబ్బులు, సంతానోత్పత్తిపై ప్రభావం, నిద్ర సమస్యల వంటివి రావొచ్చని కొందరు పరిశోధకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజమో తెలియాలంటే మరిన్ని పరిశోధలు చేయాల్సి ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.