న్యూఢిల్లీ: కొత్తగా విధించిన 10% సుంకాలను ఈ వారంలోనే 15 శాతానికి పెంచవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం గతంలో విధించిన సుంకాల స్వరూపాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తన వాణిజ్య వ్యూహాన్ని సరిచేసుకుంటున్నదని, త్వరలోనే ప్రతిపాదిత సుంకాల పెంపు ఉండవచ్చని సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెస్సెంట్ తెలిపారు. ఈ వారంలోనే పెంపుదల ఉండవచ్చని ఆయన చెప్పారు.
గతంలో విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ట్రంప్ గత నెలలో దిగుమతులపై 10% ప్రపంచ సుంకాలను ప్రకటించారు. కొత్తగా విధించిన సుంకాలు 150 రోజుల వరకు మాత్రమే(5 నెలలు) వర్తించేందుకు చట్టం అవకాశం కల్పిస్తున్నదని బెస్సెంట్ తెలిపారు. ఈ ఐదు నెలల కాలంలో గత సుంకాల వ్యవస్థను పునరుద్ధరించేందుకు చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వ అధికారులు అన్వేషిస్తారు.
ఐదు నెలల్లో పాత స్థానానికే సుంకాల రేట్లు వెళతాయని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆయన అన్నారు. ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974కు చెందిన సెక్షన్ 301, ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్‌కు చెందిన సెక్షన్ 232 కింద జాతీయ భద్రతా ఆందోళనలు, చట్టవ్యతిరేక వాణిజ్య కార్యకలాపాలను పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను బెస్సెంట్ ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చన్న ఆందోళనలను బెస్సెంట్ తోసిపుచ్చారు. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. గల్ఫ్‌కు దూరంగా సముద్రంపైన లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతున్నదని, అంతేగాక చమురు సరఫరాపై తమ ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన ప్రకటనలు కూడా చేయనుందని ఆయన చెప్పారు.
అవసరమైతే చమురు రవాణా నౌకలకు అదనపు బీమా మద్దతును అందచేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమని ఇదివరకే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హొర్ముజ్ జలసంధి ద్వారా చమురు నౌకల రవాణా సురక్షితంగా సాగేందుకు అమెరికా నౌకాదళం సాయం ఉంటుందని కూడా ఆయన చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా మంగళవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఇదే విషయాన్ని ప్రకటించారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అవసరమైతే చమురు ట్యాంకర్లకు రక్షణగా అమెరికా నౌకాదళం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.