US shutdown | అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ (US shutdown) ప్రభావం విమాన సర్వీసులపై (flight delays) తీవ్రంగా పడింది. ఈ షట్‌డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ స్క్రీనర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. దీంతో ఎయిర్‌పోర్ట్స్‌లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది.
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ అక్టోబర్ 1 నుంచి మొదలైన విషయం తెలిసిందే. దీంతో కొన్ని అత్యవసర సేవల విభాగాలకు మినహా.. మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక నగరాల్లోని విమానాశ్రయాల్లో ‘ఏటీసీ’ సిబ్బంది (air traffic controllers) విధులకు హాజరుకావటం లేదు. ఎయిర్‌పోర్ట్స్‌లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా అమెరికా వ్యాప్తంగా విమానాల రాకపోకలు స్తంభించిపోయాయి.
ఆదివారం ఒక్క రోజే దాదాపు 5 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అమెరికా మీడియా నివేదించింది. సోమవారం మధ్యాహ్నానికి 2,530కి పైగా విమానాలు ఆలస్యం కాగా, 60కి పైగా సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. చికాగో, నెవార్క్, జాన్ ఎఫ్. కెన్నడీ, అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది విమానాలు ఆలస్యమవుతుండగా, ఎయిర్‌పోర్టుల్లో భద్రతా తనిఖీల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లాస్ఏంజిల్స్, కాలిఫోర్నియా, చికాగో, వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్ సహా అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వారాంతాల్లో అయితే, ఈ పరిస్థితి మరింత దిగజారుతోంది. విమానం ఆలస్యం, రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు (funding bill) ఆమోదం దక్కకపోవడంతో అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షట్‌డౌన్ కారణంగా అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 7 బిలియన్ డాలర్ల (రూ. 62,195 కోట్లు) నష్టం వాటిల్లింది. షట్‌డౌన్ ఎత్తివేసి పూర్వ పరిస్థితులు ఏర్పడినా అది తిరిగి పొందలేని నష్టమని నిష్పక్షపాతంగా పనిచేసే కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) కొత్త నివేదిక తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలానికి మరింత నష్టం ఏర్పడుతుందని పేర్కొంది.
భవిష్యత్తులో ఏర్పడబోయే నష్టం అంచనాను హౌస్ బడ్జెట్ కమిటీకి రాసిన లేఖలో సీబీవో వివరించింది. నాలుగు వారాల షట్డౌన్లో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 7 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఆరువారాల షట్డౌన్లో 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాల షట్డౌన్లో 14 బిలియన్ డాలర్లు (రూ. 1,24,390 కోట్లు) తగ్గుతుందని సీబీఓ అంచనా వేసింది. షట్‌డౌన్ సమయంలో 10 లక్షల మంది కార్మికులకు ఎలాంటి జీతం చెల్లించకపోవడం వల్ల వస్తువులు, సేవలపై వినియోగం బాగా తగ్గిపోయింది. షట్‌డౌన్ కారణంగా ఎక్కువ మంది ఫెడరల్ ఉద్యోగులకు ఎలాంటి చెల్లింపులు జరగడం లేదు.
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 30, అర్ధరాత్రి (11:59 నిమిషాలు) వరకు ఆ బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూశారు. కానీ డెమోక్రాట్లు తగ్గకపోవడంతో.. ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. సేనేట్‌లో రిపబ్లికన్లకు కంట్రోల్ ఉన్నా.. బిల్లును పాస్ చేయించుకోలేకపోయారు. ఫండింగ్ బిల్లు సేనేట్‌లో పాస్ కాకపోవడం వల్ల నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. గడిచిన ఏడేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
Also Read..
Canada | అంతర్జాతీయ విద్యార్థులను నిలువరించడమే లక్ష్యం.. 75 శాతం దరఖాస్తులు తిరస్కరించిన కెనడా
అఫ్ఘానిస్థాన్‌లో భూకంపం.. 20 మంది మృతి
మృత్యువును గెలిచి, మానసిక అగాథంలోకి.. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుడి మనోవేదన