టొరంటో : అంతర్జాతీయ విద్యార్థులను నిలువరించడమే లక్ష్యంగా కెనడా (Canada) విధించిన కఠిన ఆంక్షలు దరఖాస్తుదారులకు శరాఘాతంగా మారుతున్నాయి. దీని ప్రభావం భారత విద్యార్థులపై తీవ్రంగా పడుతున్నది. ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్థులు దాఖలు చేసిన ప్రతి నాలుగు దరఖాస్తులలో మూడు తిరస్కరణకు గురయ్యాయి. 2023 ఆగస్టులో ఇలా తిరస్కరణ పొందిన దరఖాస్తుల సంఖ్య 32 శాతం ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో అది 74 శాతానికి చేరుకుంది.
దానికి విరుద్ధంగా ఈ రెండు సంవత్సరాలలో తిరస్కరణకు గురైన ఇతర దేశ విద్యార్ధుల సంఖ్య 40 శాతం లోపే ఉంది. దీంతో ప్రస్తుతం కెనడాలో విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మోసపూరిత విధానాల ద్వారా కొందరు విదేశీ విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతున్నారన్న అనుమానంతో కెనడా కఠిన చర్యలు చేపడుతున్నది.