వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీలపై అమెరికా విరుచుకుపడింది. బాండు దాడులతో యెమెన్ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్బేద్, రాడాలపై అమెరికా సేనలు శనివారం బాంబుల వర్షం కురిపించాయి. ఎర్రసముద్రంలో అగ్రరాజ్య నౌకపైకి హౌతీలు దాడికి సమాధానంగా అమెరికా పెద్దయెత్తున జరిపిన బాంబు దాడుల్లో 31 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారని హౌతీ ఆరోగ్య శాఖ తెలిపింది. బాంబు దాడులతో ఆయా ప్రాంతాలు భూకంపం వచ్చినట్టు కంపించిపోయాయని స్థానికులు తెలిపారు. ‘మీ టైం అయిపోయింది. ఈ రోజు నుంచే మీ దాడులను నిలిపివేయండి. అలా చేయకపోతే ఇంతకుముందెన్నడూ చూడని విధంగా నరకాన్ని చవిచూస్తారు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హౌతీలను హెచ్చరించారు. హౌతీ ఉగ్రవాదులకు ప్రధాన మద్దతుదారుగా ఉన్న ఇరాన్‌కు కూడా ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లష్కరే తాయిబా మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది హతం
ఇస్లామాబాద్: లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలో జమ్మూకశ్మీరు కార్యకలాపాల చీఫ్ ఘాజీ అబు ఖతాల్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇద్దరు గుర్తు తెలియని సాయుధులు అతడిని కాల్పిచంపారు. 2011 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఖతాల్ సన్నిహితుడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడుల్లో అతడి ప్రమేయం ఉంది. 2023 జనవరి 1న రాజౌరీలోని ధంగ్రి ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఆ మర్నాడు టైమర్ ఐఈడీ పేలుడులో మరో ఇద్దరు చనిపోయారు.