న్యూఢిల్లీ, మార్చి 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ణించినట్లు ఇరాన్లో చిన్న విహార యాత్రగా ప్రారంభమై ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇప్పుడు పరిస్థితులు దారితీస్తున్నాయి. ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని చేజిక్కించుకోవడం సహా ఆ దేశంపై విస్తృతమైన సైనిక దాడులను చేపట్టనున్నట్లు అమెరికా అధికారులు సూచనలు చేశారు. పశ్చిమాసియాకు వేలాదిమంది అమెరికన్ బలగాలను తరలించడంతోసహా ఇరాన్‌ను చావు దెబ్బ కొట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు గత వారాంతంలో అమెరికా అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. అయితే పూర్తి స్థాయి ఆక్రమణకు సంబంధించిన బలగాల కదలికల గురించి ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించనప్పటికీ రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా యుద్ధం జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు సాగుతున్నాయి.
అత్యంత అధునాతనమైన యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీ(ఎల్హెచ్ఏ-7)లో దాదాపు 2,500 మంది నౌకాదళ సిబ్బంది సహా 3,500 మంది అదనపు అమెరికన్ బలగాలు పశ్చిమాసియాలో మోహరించి ఉన్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎల్-35 స్టెల్త్ ఫైటర్లు, ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన ట్రిపోలీని జపాన్ నుంచి పర్షియల్ గల్ఫ్‌కు సమీపంలో అమెరికా మోహరించింది. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన బలగాలు ఇప్పటికే పశ్చిమాసియాలో ఉండగా అదనంగా మరో 10,000 బలగాలను అక్కడ మోహరించే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం(పెంటగాన్) యోచిస్తున్నది.
గరిష్ఠ స్థాయిలో ప్రత్యామ్నాయ వ్యవస్థలను మోహరించేందుకు యూఎస్ఎస్ బాక్సర్(ఎల్‌హెచ్‌డీ-4)తోసహా శక్తివంతమైన యుద్ధనౌకలను అక్కడకు తరలిస్తున్నది. భూతల బలగాలు లేకుండానే తమ లక్ష్యాలను సాధించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తారని ఆయన చెప్పారు. కమాండర్ ఇన్ చీఫ్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని రకాల సన్నాహాలు చేయాల్సిన బాధ్యత పెంటగాన్‌కు ఉందని ఆయన చెప్పారు. గరిష్ఠ స్థాయిలో ప్రత్యామ్నాయాలు ఉంటాయని వైట్ హౌస్ మహిళా ప్రతినిధి కరోలిన్ తెలిపారు. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆమె వివరించారు.

ఇరాన్‌కు చెందిన అత్యధిక ఎగుమతులు జరిగే పర్షియన్ గల్ఫ్‌లోని ఖర్గ్ ద్వీపంపైనే అమెరికా ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. చైనాకు నేరుగా చమురు ఎగుమతులు ఖర్గ్ నుంచే జరుగుతున్నాయి. ఖర్గ్‌ను స్వాధీనం చేసుకున్నా లేక దానిపై పట్టు సాధించినా అది ఇరాన్ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయగలదు. అంతేగాక ప్రపంచ ఇంధన ప్రవాహంపై అమెరికా ఆధిపత్యానికి ఇది మరింత దోహదపడగలదు. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఇరాన్ సరిహద్దుల ఆక్రమణగా కాక ఇరాన్‌ను ఆర్థికంగా చావుదెబ్బ తీయడంగా పరిగణించాలని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హొర్ముజ్ జలసంధిపై కూడా పూర్తి స్థాయి పట్టు సాధించిన పక్షంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌ను శాసించవచ్చని అమెరికా భావిస్తున్నది.
ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ద్వారా చైనాలాంటి ప్రధాన చమురు కొనుగోలుదారులను తమ దారిలోకి తెచ్చుకోవచ్చన్నది కూడా అమెరికా వ్యూహంగా కనపడుతున్నది. అయితే ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకోవడం అంత సులభమేమీ కాదని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే భీకర క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కోవలసి వస్తుందని, అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఖర్గ్పై జరిగే చిన్న దాడి అత్యంత వేగంగా భీకర యుద్ధంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.
యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అమెరికన్ ప్రజల్లో సైతం అధ్యక్షుడు ట్రంప్ పట్ల నిరసనలు మిన్నంటుతున్నాయి. అనవసరంగా వేరే దేశాలకు చెందిన యుద్ధాల్లో తలదూర్చబోమని గతంలో వాగ్దానం చేసిన ట్రంప్ ప్రస్తుత వైఖరి మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మద్దతుదారుల్లో కూడా అసహనానికి దారి తీస్తున్నది. ట్రంప్ సైతం విభిన్న ప్రకటనలు చేస్తూ యుద్ధం పట్ల ప్రజలనే కాక ప్రపంచ నాయకులను కూడా గందరగోళానికి గురిచేస్తున్నారు. ఒకపక్క ఇరాన్‌తో ఎటువంటి ఒప్పందం ఉండదని చెబుతూ మరో పక్క బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్‌ను బెదిరిస్తున్నారు. యుద్ధం దాదాపు ముగిసిపోయిందని చెబుతూనే ఇరాన్‌పైకి అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీచేస్తున్నారు.