చెన్నూర్ టౌన్, మార్చి 30 : చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని శ్రీహిందూ మృతిపై కాళేశ్వరం జోన్ జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, మంచిర్యాల జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి రామ కళ్యాణి సంయుక్తంగా విచారణ జరిపారు. పాఠశాలలో జరిగిన ఘటనపై సి బ్బంది, బాలికలతో మాట్లాడామని, ఈ నివేదికను కలెక్టర్‌తో పాటు సొసైటీ ఉన్నతాధికారులకు సమర్పించినట్లు జోనల్ అధికారి గిరిజ వివరించారు. అజాగ్రత్తగా వ్యవహరించినందు కు ఇద్దరు ఉపాధ్యాయులను వెంటనే విధుల నుంచి తొలగించామని ఆమె పేర్కొన్నారు. శ్రీహిందూ చికిత్సపొందిన ప్రైవేట్ దవాఖానకు రూ.26 వేలను చెన్నూర్ పాఠశాల ప్రిన్సిపాల్ చెల్లించారని తెలిపారు. గుర్తు తెలియని ద్రావణాన్ని తాగినట్లు విద్యార్థిని హౌస్ టీచర్కుగానీ, హెల్త్ సూపర్ వైజర్‌కు గానీ తెలిపితే సత్వరమే మెరుగైన చికిత్స అందించేవారమని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ బాలిక మృతి చెందడం విషాదకరమైనదని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సా యం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు.
గురుకులాలపై శీతకన్ను
గురుకుల పాఠశాలలో ఏం జరుగుతున్నదోనని, ఎప్పుడు ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చెన్నూర్‌లో తరచూ ఏదో ఒక హాస్టల్లో సంఘటనలు జరుగుతుండడం ఇందుకు కారణమవుతున్నది. ఇదే నెలలో మహాత్మా జ్యోతిబాపులే విద్యార్థి అదృశ్యమవడం, మళ్లీ ఆచూకీ లభించడం.. ఈ సంఘటన మరువకముందే గురుకులంలో ఓ విద్యార్థిని మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. వరుస ఘటనలతో గురుకులాల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి.
గడ్డిమందు ఎలా వచ్చింది?
స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థి మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్య పట్టణంలో కలకలం రేపగా, గడ్డిమందు పాఠశాలలోకి ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థంగా మారింది. ప్రతి నెలా రెండు, నాలుగు ఆదివారాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలను కలిసే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రధాన గేటు ఎదుటే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బయటి నుంచి తెచ్చిన పదార్థాలను అనుమతించకపోగా, పూర్తిగా పరిశీలించాకే సందర్శకులను విజిటర్స్ గదుల్లోకి అనుమతిస్తారు. కాగా, సక్రమంగా తనిఖీలు నిర్వహించలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
గడ్డిమందు తాగిన విషయం పాఠశాల సిబ్బంది గుర్తించకపోవడం, వైద్య సిబ్బందికి ఫుడ్ పాయిజన్ అని చెప్పడం, పరిస్థితి విషమించేదాకా స్థానిక దవాఖానలో చికిత్స అందించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. విద్యార్థుల ఆలనాపాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాల్సినంత బలమైన కారణమేమిటని, గడ్డిమందు ఎక్కడి నుంచి వచ్చింది? ఇటీవల హాస్టల్ నుంచి ఔటింగ్‌కు వెళ్లినప్పుడు తెచ్చుకొని ఉంటుందా? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, శ్రీహిందూ మృతి ఘటనలో జిల్లా జూనియర్ ప్రిన్సిపల్ జడ్జి నిరోషా రికార్డ్ చేసిన మరణవాంగ్మూలమే ఇప్పుడు కీలకంకానున్నది. ఏదైమైనా సంక్షేమ హాస్టళల్లో వరుస సంఘటనలు తలెత్తుతుండడంతో నిర్వాహకుల తీరుపై ఆందోళన కలుగుతున్నది.