దేశంలో నక్సలిజం సహా అన్ని విధాలైన కమ్యూనిస్టు, సోషలిస్టు, వామపక్ష భావజాలాలు క్రమంగా బలహీన పడుతున్నాయనేందుకు మరొక రుజువుగా ఇప్పుడు అనునిత్యం పేదరికం అనే మాటలకు బదులు కులాల మాటలు మాత్రమే వినవస్తున్నాయి. వేర్వేరు కులాల పట్ల వివక్ష, వాటి హక్కులు, వాటి సాధికారత, వాటికి రాజ్యాధికారం పద్ధతిలో. అందుకు సంబంధించిన ఏవో కార్యక్రమాలంటూ జరగని రోజు ఉండటంలేదు. కొంతకాలం క్రితం వరకు పరిస్థితి ఏమిటి? పేదల పట్ల వివక్ష, వారిపై దోపిడీ, వారి హక్కులు, వారికి అధికారం అనే మాటలు, రచనలు, కార్యక్రమాలు. ఇప్పుడది అరుదుగా తప్ప వినము. ఈ మార్పు ఒక స్థాయిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొక స్థాయిలో ఆశ్చర్యాన్ని కలిగించదు. ఇందులో అర్థం చేసుకోవాల్సినవి అనేకం ఉన్నాయి
కొన్ని ప్రశ్నలు వేసుకుని వాటి ప్రాతిపదికగా విషయాలను చర్చిస్తే అర్థం చేసుకోవటం సులభమవుతుంది. ఈ మార్పు రావటానికి మూలాలు ఎక్కడున్నాయి? మార్పు ఎప్పుడు, ఎట్లా మొదలైంది? తర్వాత ఏ విధంగా పరిణమిస్తూ పోయింది? ఆ మార్పుల క్రమంలో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరి లక్ష్యాలు ఏమిటి? ఎవరు సాధించినది ఏమిటి? సాధించనిది ఏమిటి? సాధ్యాసాధ్యాల వెనుక గల కారణాలేమిటి? మునుముందు ఏమి జరగవచ్చును, ఏమి జరగకపోవచ్చను? ఈ తరహా ప్రశ్నల గురించి ఇక్కడ చేస్తున్న చర్చ అంతిమమైనది కాదు. ఎప్పుడైనా ఒక ప్రశ్నపై భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందువల్ల, ఈ ప్రశ్నల గురించిన చర్చలు సాగుతూ పోవటం అవసరం.
అర్థం చేసుకోవలసిన పరిస్థితి మరొకందుకు కూడా ఉన్నది. దేశంలో ఆధునిక స్వాతంత్య్రోద్యమం 1885లో కాంగ్రెస్ స్థాపనతో మొదలై ఇప్పటికి 140 ఏండ్లు దాటింది. ఆధునిక అనే మాటకు మరొక అర్థం ఆధునిక రాజకీయ, సామాజిక, ఆర్థిక భావజాలాల వ్యాప్తి. ఆ ఉద్యమంక్రమంగా సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో, వేర్వేరు సిద్ధాంతాలను కూడా కలుపుకొంటూ 50 ఏండ్లకు పైగా (1885-1947) సాగింది. స్వాతంత్య్రానంతరం ఒక గొప్ప రాజ్యాంగాన్ని సకల వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం 1950లో అమలులోకి తెచ్చుకుని 75 ఏండ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి ఈ కాలమంతా కేంద్రంలో, రాష్ర్టాల్లో పలు సిద్ధాంతాల రాజకీయ పార్టీలు పాలించాయి, పాలిస్తున్నాయి.
భారత సమాజంలో కుల వ్యవస్థ, వివక్షలు, దోపిడీ అన్నవి ఒక వాస్తవం గనుక ఈ దశాబ్దాల పొడవునా అందుగురించిన చర్చలు, విధానపరమైన చర్యలు, వివక్షలపై ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు సమాంతరంగా, ధనిక-పేద తారతమ్యాలు, పేదలపై దోపిడీ, పేదల హక్కుల హక్కులు, వారికి అధికారం అన్న చర్చలు, ఉద్యమాలు కూడా సాగుతూనే ఉన్నాయి. గమనించవలసిన మరొక ముఖ్య విషయమేమంటే, కులాల సమస్యలకు పరిష్కారాలను కోరుతూనే, అందుకు అంతిమ పరిష్కారం పేదరిక పరిష్కారంలో ఉన్నదనే భావన మొదటి నుంచి బలంగా ఉండేది.
స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించిన నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులపై సోషలిస్టు భావజాల ప్రభావాలు ఉండటం, 1920లతో మొదలై కమ్యూనిస్టు పార్టీ, తర్వాత కొంత కాలానికి సోషలిస్టు పార్టీలు వ్యాప్తిలోకి రావటం, వాటి నాయకత్వాన కార్మిక, కర్షకోద్యమాలు జరగటం, ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వారు బడుగు కులాల వారు కావటం ఇందుకు కారణాలు. స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ భావజాలాలే ప్రభుత్వాల్లో, బయటా ప్రభావం చూపాయి. లోహియా వాదంతో ఏర్పడిన పార్టీలు సైతం బడుగు కులాల గురించి మాట్లాడుతూనే సోషలిస్టు సిద్ధంతాలతో పని చేయటం విశేషం. ఈ పరిస్థితి 1980లలో బీఎస్పీ ఏర్పడే వరకు పెద్దగా మారలేదు. అప్పటికే మహారాష్ట్ర రిపబ్లికన్ పార్టీలు విఫలమయ్యాయి.
ఈ విధమైన సుదీర్ఘ పరిస్థితుల్లో మార్పు రావటానికి మూలాలు ఎక్కడున్నాయి? మార్పు ఎప్పుడు, ఎట్లా మొదలైంది? పేదరికం అనే మాటకు బదులుగా కులాలు అనే మాట వైపు దృష్టి మళ్లటం ఎందుకు జరిగింది? ఇది అకస్మాత్తుగా వచ్చిన మార్పు కాదు. ఏదో ఒక్క కారణం వల్ల జరిగిందీ కాదు. వేర్వేరు కారణాల వల్ల క్రమంగా జరుగుతూ పోయింది. ఆ దిశలో జరిగిన మొదటి పరిణామం, పేదరిక నిర్మూలనలో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం. పేదరిక నిర్మూలనలో వైఫల్యం అంటే ఆ పని చేయగలమన్న తమ సోషలిస్టు తరహా విధానాల వైఫల్యమన్నమాట. అది ఆచరణలో విఫలమైనప్పుడు పేదలు, ఇతర సామాన్యులు ఆ సిద్ధాంత ప్రవచనంలోనూ విశ్వాసం కోల్పోతారు. అంతటితో ఆ సిద్ధాంతమే అర్థరహితమవుతుంది. జరిగింది సరిగా అదే. అట్లా జరిగినప్పుడు సైద్ధాంతిక శూన్యం ఏర్పడుతుంది.
కాంగ్రెస్ దీర్ఘకాలంపాటు కేంద్రంలో, రాష్ర్టాల్లో కూడా పాలించినందున, వారి వైఫల్యంతో సైద్ధాంతిక శూన్యత దీర్ఘకాలికం దేశవ్యాపితం అయింది. తర్వాత కాలంలో పేదరికం, దానిపై పోరాటం అనే మాట క్రమంగా మరుగున పడుతూ కులాల మాట ముందుకు రావటానికి బీజాలు ఆ శూన్యంలో పడ్డాయి. మరికొంత కాలానికి కులం పేరిట కూడా ఉద్ధరణలు లేకపోగా పేదవర్గాల్లో, కులవాద వర్గాల్లో మత భావనల వైపు ఆకర్షణ కలగటానికి మూలాలు కూడా ఈ ఒరిజినల్ శూన్యతలో ఉన్నాయి. మనిషి ఒకసారి జారుడుబండపై కాలు పెడితే ఎక్కడికైనా జారవచ్చుననే పద్ధతిలో అన్నమాట.
ఇటువంటి మార్పు మొదలైన తర్వాత ఆ ప్రభావంతో పేదరికం అనే ఆలోచనా ధోరణి, పరిభాష మారి బడుగు వర్గాలు తమ పరిష్కారాలను కులం ఆలోచనల్లో, పరిభాషలో వెతుక్కొని చూడటం ఒక పరివర్తన అయింది. అదే సమయంలో, అందుకు సమాంతరంగా, కాంగ్రెస్ వంటి మధ్యేమార్గ పార్టీలు అంతకుముందు ఉండిన పేద వర్గాల మద్దతును కోల్పోతూ అధికారం కోసం తాము కూడా కుల వర్గాల మద్దతు కోసం ప్రయత్నించే ధోరణి పెరగసాగింది. కులాల లెక్కలు గతంలోనూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ లెక్కలు ఇంకా పెరగటం మొదలైంది. అటు పేదల లెక్కలు, ఇటు పార్టీల లెక్కలు కూడా ప్రధానంగా అవే అయ్యే మలి దశలోకి భారత రాజకీయాలు, ప్రజాస్వామ్యం ప్రవేశించాయి. ఒకసారి ఆ సుడిగుండం ఏర్పడిన తర్వాత అందుకు ఎవరూ మినహాయింపు కాలేదు. పైకి ఒప్పుకోకపోయినా కమ్యూనిస్టులు సహా. మరికొంత కాలానికి బలపడటం మొదలైన బీజేపీ సైతం.
పేదరిక వాదం కులవాదంగా మారి బలపడటానికి ఒక ముఖ్య కారణం పేదరిక నిర్మూలనలో కాంగ్రెస్ తదితర మధ్యేమార్గ పార్టీల వైఫల్యం, అది సృష్టించిన శూన్యం కాగా, వామపక్షాల వైఫల్యం రెండవది అయింది. మధ్యేమార్గ పార్టీల వైఫల్యం కన్నా వామపక్షాల వైఫల్యం తీవ్రమైనది. ఎందుకంటే, మధ్యేమార్గ పార్టీలు పేదరికం గురించి మాట్లాడటం ప్రజాస్వామిక ప్రగతిశీల దృష్టితో జరిగేది.
అందుకు భిన్నంగా వామపక్షాలు వర్గ సమాజ దృష్టితో ఆ వాదన చేస్తాయి. అది కేవలం సంస్కరణవాదం, సంక్షేమవాదం కాదు. అటువంటప్పుడు వారు కూడా తాము పాలించిన చోటగాని ఇతరత్రా గాని అందుకు బద్ధులై ఉండకుండా ఓట్లు, సీట్లు, పొత్తుల రాజకీయంలో పడి రాజీలు చేసుకుంటున్నప్పుడు పేద వర్గాలకు మిగిలే ఆశ ఎక్కడ? ఈ పరిణామాల పర్యవసానంగా కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు కూడా కుల సమీకరణల్లో, ఓటు బ్యాంకుల్లో నవ సమాజాన్ని వెతుక్కోసాగారు. పైకి ఏమి మాట్లాడినా కనీసం రెండు తరహాల రాజకీయాల్లో ద్విపాత్రాభినయం చేయసాగారు. ఫలితం మాత్రం అదే. పేదలు, సామాన్యులు, బడుగువర్గాలు తమ సమస్యలను, తమ ముందున్న రాజకీయ-ఆర్థిక వ్యవస్థను పేదరికం అనే దృక్కోణం నుంచి చూసి పరిష్కారాలను వెతికే ఆలోచనా ధోరణిని వదిలివేస్తూ, కులాల దృక్కోణం నుంచి చూసే ధోరణి వైపు మారుతూ పోయారు. కాలం గడిచినా కొద్దీ దాని వెనువెంట, పైన చెప్పుకొన్నట్టు మరొక పరిణామం చోటు చేసుకోసాగింది.
అదే శూన్యంలోకి మతవాదం, మత లక్షణాలతో కూడిన జాతీయవాదం ప్రవేశించటంతో పేదవర్గాలు, ఇతర సామాన్యులు అటువైపు ఆకర్షితులు కావటం. పరిణామక్రమం కనీసం కుల ధోరణుల వద్ద ఆగినట్టయితే, కులాల సమస్యలు పరిష్కారమయ్యే కొద్దీ ఆలోచనా ధోరణి అంతటితో ఆగిపోగల అవకాశం ఉంటుంది. కానీ పేదరికం దృష్టి నుంచి కులాల దృష్టికి మారిన రాజకీయ నాయకత్వాలు గాని, కుల నాయకత్వాలు గాని, అటువంటి పరిష్కారాల కోసం అయినా చిత్తుశుద్ధితో ప్రయత్నించలేదు.
రాజకీయ నాయకత్వాలు, కుల నాయకత్వాలు కూడా ఆ వర్గాలను తప్పుదారి పట్టిస్తూ ఆ నినాదాలను, ఓటు బ్యాంకులను ఉపయోగించుకుంటూ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించాయి. పేదరికం నినాదం నుంచి కుల నినాదం వైపు మళ్లిన వారు మత నినాదం వైపు మళ్లేందుకు బీజాలు అక్కడ పడ్డాయి. వారు అట్లా మళ్లటం ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు స్థాయుల్లో ఉండవచ్చు. కానీ బీజాలు మాత్రం పడ్డాయి. వాటితో తలపడేందుకు మధ్యేమార్గవాదులు, వామపక్షవాదులు నానాశ్రమ పడుతున్నారు. పరిస్థితి ఇట్లా మారటానికి కారణం మాత్రం వారే.
దీనినంతా ఎదుర్కొనేందుకు మధ్యేమార్గీయులకు గాని, వామపక్షవాదులకు గాని, ఉదారవాదులకు గాని ఎటువంటి వ్యూహంలేదు. చీకట్లో బాణాలు సంధించినట్టు గోలగోలగా మాట్లాడటం తప్ప. ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకోజూసినట్టు, ఇందులోంచి ఏవైనా వ్యక్తిగత ప్రయోనాల కోసం ప్రయత్నించటం తప్ప పేదరికం మాట నుంచి కుల మాటల నుంచి, మతం మాటల వైపు సాగుతూ వచ్చిన ప్రయాణానికి స్వయంగా బాధ్యులైన వీరంతా ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేయగలరని నమ్మగలమా? వీరు బొగ్గులు ఏరుకుని అయినా తమ భవిష్యత్తును భద్రపరుచుకోగలరేమో. కానీ వారి చేతిలో పేదల భవిష్యత్తు, దేశం భవిష్యత్తు భద్రంగా ఉండగలవా?
రాజకీయ నాయకత్వాలు, కుల నాయకత్వాలు కూడా ఆ వర్గాలను తప్పుదారి పట్టిస్తూ ఆ నినాదాలను, ఓటు బ్యాంకులను ఉపయోగించుకుంటూ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించారు. పేదరికం నినాదం నుంచి కుల నినాదం వైపు మళ్లిన వారు మత నినాదం వైపు మళ్లేందుకు బీజాలు అక్కడ పడ్డాయి. వారు అట్లా మళ్లటం ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు స్థాయుల్లో ఉండవచ్చు.
– టంకశాల అశోక్