తిరుమల : వేంకటేశ్వర స్వామి భక్తుల కోసం టీటీడీ ( TTD ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌కు (Srivani Darshan Tickets) సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసింది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచగా వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచుతున్నారు. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించారు. ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తిస్తుందని వెల్లడించింది.
ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేసి మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపబడతాయని వివరించింది. ఈ విధానం జూన్ 10వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని టీటీడీ తెలియజేసింది.