వాషింగ్టన్: భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు (Trump Tariffs) బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 6న ఈ ఎగ్జిటీవ్ ఆర్డర్‌పై 14329పై సంతకం చేసిన ట్రంప్.. ఈ నెల 27 నుంచి 50 శాతం టారీఫ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీంతో తాజాగా 25 అదనపు సుంకాలపై అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసులు జారీ చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12.01 గంటల నుంచే అమల్లోకి వస్తాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా హోమ్‌లాండ్ ఆఫ్ సెక్యూరిటీ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది.
కాగా, అమెరికా విధించిన భారీ సుంకాలు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారుల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) మంగళవారం ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏఏ రంగాలపై ప్రభావం?
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వస్తే వ్యవసాయం, ఫార్మా, జౌళి, చర్మ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎగుమతులపైనే ఆధారపడిన పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈలు)లపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ వ్యూహమని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగే సమావేశంలో ఎగుమతిదారులకు ఎలాంటి భరోసా కల్పించాలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.