వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2026 బడ్జెట్‌ను ఆమోదించడానికి అర్ధరాత్రి గడువును కాంగ్రెస్ కోల్పోవడంతో శనివారం అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ కారణంగా ప్రభుత్వ నిధులలో తాత్కాలిక అవరోధం తలెత్తిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. ఈ షట్‌డౌన్ తాత్కాలికమేనని శాసనకర్తలు సూచించగా వచ్చే వారం మొదట్లో సెనేట్ మద్దతుతో నిధుల విడుదలపై ఓ బిల్లును కాంగ్రెస్ ఆమోదించే అవకాశం ఉంది.
గతవారం ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతుల్లో మిన్నీపోలిస్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందడంపై డెమోక్రటిక్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిధుల బిల్లుపై చర్చలు విఫలం కావడంతో వాటి విడుదలలో అవరోధం ఏర్పడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ కోసం కొత్త నిధుల కేటాయింపుపై చర్చలకు ఈ ఘటనతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఫెడరల్ ఏజెంట్ల ప్రవర్తనపై కొత్త ఆంక్షలను చేర్చడానికి డీహెచ్ఎస్ నిధుల బిల్లును సమీక్షించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.