అంత విలువైన ప్లేస్‌లో ఊయల ఎందుకండీ..” అంది లహరి.“ఏదో అమ్మా-నాన్న ముచ్చటపడి వేయించుకొన్నారు. వదిలేద్దూ”.. అన్నాడు సూర్యనారాయణ.అలా అతను భార్యకు నచ్చచెప్పడం పదోసారి.“అంతగా ఊయలలో ఊగాలని ఆ ఆదిదంపతులకు ఉంటే.. అదేదో వరండాలో వేయించండి. ఎంచక్కా ఊగుతూ వాళ్లు ఎంజాయ్ చేస్తారు” అంది లహరి వ్యంగ్యంగా.భార్యని విచిత్రంగా చూశాడు. “ఎవరో ఒకరు ఇంటికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వరండాలో ఊయల వేసుకొంటే మాత్రం ఏం ఎంజాయ్ చేయగలరు…?” అన్నాడు. “నా ఉద్దేశం మీకు అర్థం కావడం లేదు”.. అని భార్య ఏదో చెప్పబోతుంటే..“ఆ విషయం వదిలెయ్యి” అని చేతులెత్తి దండం పెట్టాడు.“మీది మొద్దు బుర్ర! ఏదీ ఒక పట్టాన అర్థమై చావదు” గొణిగింది లహరి.భార్యాభర్తల మాటలు హాల్లో ఉన్న సరస్వతికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో ఆమె భర్త రఘురాం కూరగాయల కోసం మండీకి వెళ్లాడు. సాయంత్రం ఐదు కాగానే ఈశాన్య దిశలోని ఆ ఖాళీ స్థలంలో ఉన్న ఆ ఊయలలో ఊగడం ఆ దంపతులకు ఇష్టం. భార్యని ఆ ఊయలలో కూర్చోపెట్టి రఘురాం ఊపుతుంటాడు. ఒక్కోసారి రఘురాం కూర్చుంటే.. సరస్వతి ఊపుతుంది.
ఆ ఊయలలో కూర్చొని ఉన్నప్పుడే భర్తకి ఇష్టంగా ‘టీ’ తెచ్చి అందిస్తుంది సరస్వతి.ఒక్కోసారి సరస్వతి ఊగుతూ ఎంజాయ్ చేస్తుంటే, రఘురాం తానే స్వయంగా వేడివేడి పకోడీలు వేసుకొని తెచ్చి ఇస్తుంటాడు. ఇద్దరూ ఊయల్లో కూర్చొని తింటారు. కొత్తగా పెళ్లయిన దంపతులు కూడా అంత హ్యాపీగా కన్పించరు. ఇద్దరికీ ఇష్టమైన ప్రదేశం అది. పాతికేళ్ల సంసారిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆ దంపతులు. అప్పట్లో కంపెనీకి అర్ధాంతరంగా లాకౌట్ ప్రకటిస్తే.. రఘురాం తల్లడిల్లి పోయాడు. ‘ఏం పని చేసి పిల్లలని కాపాడుకోవాలి? చదివించు కోవాలి?’ అని బెంగపడుతుంటే.. సరస్వతే ఆధారమైంది. బీడీలు చుట్టి కుటుంబాన్ని నిలబెట్టింది. అప్పట్లో కరీంనగర్లో ఉండేవాళ్లు. ఒక మిత్రుడి ద్వారా జాబ్ రావడంతో హైద్రాబాద్‌కి మారారు. కుటుంబం పట్ల భాద్యతగా ఉండేది సరస్వతి.
అందుకే రఘురాంకి భార్యపైన ఎనలేని ప్రేమ. సూర్యనారాయణతోపాటు ఆమనికి కూడా వాళ్లు జన్మనిచ్చారు. ఆమనికి చిన్న వయసులోనే పోలియో సోకింది. భార్యాభర్తలు అల్లాడిపోయారు. సరస్వతి ఎంతో ఓర్పుతో కూతుర్ని చూసుకొనేది. ఇంటిని సముదాయించుకుంటూనే పిల్ల ఆలనా పాలనా చూసుకొనేది. ఒక్క పోలియో అయితే అంత సమస్య అయ్యేది కాదేమో.. ఆమనికి మెంటల్ మెచ్యూరిటీ కూడా తక్కువగానే ఉండేది. దాంతో, బిడ్డల్ని కనురెప్పల్లా చూసుకొనేది సరస్వతి.“ఇలాంటి బిడ్డను మాకెందుకు ఇచ్చావురా భగవంతుడా!?” అని కూతుర్ని చూసుకొని రఘురాం వాపోతే.. “బంగారం లాంటి కొడుకుని కూడా ఆ దేవుడే కదండీ ఇచ్చింది. భగవంతుడు ఏమిస్తే అది స్వీకరించడం మన విధి..” అంటూ ఓదార్చేది.“మనుషుల సహనాన్ని పరిక్షించేందుకే భగవంతుడు ఇలా చేస్తుంటాడు. అలా బెంగ పడితే ఎలాగండీ” అని కూడా అనేది.మానసికంగా మెచ్యూరిటీ లేకున్నా, సూదంటు రాయిలా ఆకర్షించే రూపం ఉండటంతో ఆమనికి పెళ్లి సంబంధం కుదిరింది. కూతురికి పెళ్లి చేసిన తర్వాత సూర్యనారాయణ కెరీర్ కూడా వాళ్లకో సవాలుగా నిలిచింది.
సూర్యం చదువు మీద పెద్దగా శ్రద్ద పెట్టేవాడుకాదు. సరస్వతి దగ్గరుండి చదివించేది. ఎట్టకేలకు బీటెక్ చేసి, ఒక కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. లహరి ఇంటి కోడలయింది. అత్తామామ అన్యోన్యత.. ఆ అమ్మాయికి ఎందుకో నచ్చేది కాదు. వాళ్లు తనకి యువదంపతుల్లా కనిపించేవాళ్లు. తనపై సూర్య అంత ప్రేమ చూపడం లేదని కూడా లహరి దెప్పుతూ ఉండేది.“మీ అమ్మానాన్నల్ని చూడు. చిలుకా గోరింకల్లా ఎంత చక్కగా కబుర్లు చెప్పుకొంటారో! మీరు ఆఫీసులో పనిచేసేదే కాకుండా ఇంటికొచ్చి కూడా ఆ ల్యాప్‌టాప్ ముందేసుకొని కాలక్షేపం చేస్తారు” అనేది.
“వర్క్ పెండింగ్‌లో ఉంటే ఏం చేయాలి లహరీ!”.. అనేవాడు.అన్నిటికంటే కూడా అత్తామామ ఆ ఊయలలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం.. కిలకిలా నవ్వుకోవడం చూస్తుంటే ఆ అమ్మాయికి గుండె దహించుకుపోయేది. చీటికీమాటికీ గొడవపెట్టుకొనే తన తల్లిదండ్రులను ఊహించుకొనేది. వాళ్లు ఊహల్లోకి రాగానే అత్తామామలపై మరింత జెలసీ పెరిగేది. వాళ్ల సంపూర్ణ ఆనందానికి కారణమైన ఆ ‘ఊయల’ను తీసివేయించాలన్న నిర్ణయానికి వచ్చింది లహరి. ఆమె ఆలోచనల్లో ఉండగానే.. రఘురాం వచ్చాడు. కూరగాయలు భార్య చేతికి ఇస్తూ..“కూరగాయల ధరలు మండిపోతున్నాయ్ సరసూ..” అన్నాడు.“ఎంత మండినా కొనకా తప్పదూ.. తినకా తప్పదు కదా! జీవుడు ఉన్నంతకాలం దేహచింతన అనివార్యం కదా!” అంది వేదాంత ధోరణిలో. “టమాటాలు వంద రూపాయలు అమ్ముతున్నారు. కాస్త జాగ్రత్తగా వాడండి” చెప్పాడు.అక్కడికి లహరి వచ్చింది. కూరగాయలు తీసి ఫ్రిజ్‌లో పెడుతూ..“టమోటా ప్లేస్‌లో కాస్త చింతపండు వేస్తే సరిపోతుందికదా మావయ్యా..” అంది.
“అవునమ్మా! ఆమధ్య ఉల్లిపాయల ధరలు కొండెక్కినప్పుడు కూడా తాళింపులో అసలు ఉల్లిపాయలు వేసుకోవడమే మానేసాంగా” గుర్తు చేసాడు.“మామా-కోడళ్లు కాస్త పొదుపు చర్చలు ఆపండి” అంది సరస్వతి.. కాస్త కోపంగానే. భార్య మూడ్ ఎందుకో బాగలేదని అర్థమైంది రఘురాంకి.“ఇలా పైసాపైసా పొదుపు చేయబట్టే కదా.. ఇంత ఇల్లు కట్టించగలిగారు అత్తయ్యా!” అంది లహరి. “అవును తల్లీ.. బాగా చెప్పావు” అన్నాడు రఘురాం.“ఇల్లంటే.. నాలుగు ఇటుకరాళ్లు, తలుపు ద్వారబందాలు కాదు. అనురాగం, ఆత్మీయత రంగరించుకున్న ఒక పొదరిల్లు” అంది సరస్వతి.“మీ అంత పొయిట్రీ నాకు రాదులే అత్తయ్యా! అయినా మీ పొదరిల్లు కాన్సెప్ట్‌కు భంగం ఏమైనా కలిగిందా!?” అంది లహరి.కోడలివైపు అదోలా చూసింది సరస్వతి.“పుస్తక పరిజ్ఞానం మీ అత్త మన దగ్గర బాగానే ప్రదర్శిస్తుందిలే తల్లీ! కాస్త కాఫీ కలిపి పట్టుకురామ్మా!” అన్నాడు రఘురాం.
“అలాగే మావయ్యా!” అని లహరి వంటగదిలోకి వెళ్లింది. కోడలు వెళ్లాక.. “ఈ ఇంట్లో ఏ మూల చూసినా నువ్వే గుర్తొస్తావు సరసూ!” అన్నాడు.“గుర్తుకురావడం ఏంటండీ..” అంది వింతగా భర్తను చూస్తూ.“నీ కొడుకు ఒక ప్రపోజల్ తెచ్చాడు” అని చెప్పి, అంకురార్పణగా వంటగదివైపు చూస్తూ.. కోడలు వినడం లేదని నిర్ధారించుకున్నాక.. “ఈ ఇల్లు అమ్మేసి గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటాడట. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుని డౌన్‌పేమెంట్ కింద కడ్తాడట” చెప్పాడు.పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడింది సరస్వతి. “వాడికి ఇదేం బుద్ది..” గొణుక్కుంది.‘భార్య ఉయ్యాల మాత్రమే కూల్చాలనుకుంది. మొగుడు ఇల్లే లేపెయ్యాలని అనుకుంటున్నాడా?’ అనుకుంది.కొడుకు-కోడలు మధ్య జరిగిన సంభాషణ చెప్పాలనుకుంది.‘ఇల్లే అమ్మాలనుకున్న తర్వాత ఇక ఉయ్యాలదేముంది..?’ అనుకుంది.ఇంటి స్థలాన్ని సమకూర్చుకోవడానికి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో అంతా గుర్తుకొచ్చింది సరస్వతికి. సకాలంలో అద్దె కట్టకపోతే ఇంటి యజమానులు మాట్లాడే మాటలు చాలా అవమానకరంగా ఉండేవి.
‘ఇంటికి ఇంత అద్దె కట్టలేకపోతే.. ఎక్కడన్నా మీ స్థాయికి గుడిసె దొరికితే అందులో చేరిపోండి’ అనేవారు కొందరు. ‘మీలాంటి పేదలకోసమే ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తున్నది. ఓ దరఖాస్తు చేసుకోండి’ అని సలహా ఇచ్చేవాళ్లు మరికొందరు. భర్త సంపాదించిన డబ్బును పొదుపు చేస్తూ.. తాను కూడా ఎంతోకొంత సంపాదిస్తూ.. దాచుకున్న డబ్బుని చీటీవేసి ముందుగా స్థలం కొన్నారు. పిల్లల్ని ఒకవైపు చదివించుకుంటూనే.. మరోవైపు పొదుపు చేస్తూ ఇల్లు మొదలుపెట్టారు. ఇంటికి ఈశాన్యంవైపు జాగా మిగిల్చి.. అందులో ఊయల వేయాలన్నది సరస్వతి కోరిక. భార్య కోరికను రఘురాం కాదనలేదు. ఖాళీ జాగాలో రెండు ఇనుప స్తంభాలు పాతి, చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా పెద్ద చెక్కబల్లతో ఊయల పెట్టించాడు. సరస్వతి తన జీవితంలో ఏమీ కోరుకోలేదు. రక్తమాంసాలు కరిగించి తనకీ, పిల్లలకీ చాకిరీ చేసింది. వానప్రస్థ దశలో కోరిన చిన్న చిలిపి కోరికను ఇష్టంగా తీర్చాడు. ఇల్లు అమ్మేస్తే తను ఇష్టపడి ఏర్పాటు చేసుకొన్న ఊయల.. ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో వేసుకోవడం సాధ్యంకాదు. అసలు అంత జాగా కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకే ఇల్లు అమ్మాలన్న కొడుకు ఆలోచనకు ‘నో’ చెప్పాలని నిర్ణయించుకున్నాడు రఘురాం.
“ప్లాన్ రివర్స్ అయిందన్నమాట” అంది లహరి.‘ఏంటీ!?’ అన్నట్టు చూశాడు సూర్య నారాయణ.“అదే ఇల్లు అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకున్న నీ ప్లాన్ రివర్స్ అయిందన్న మాట”..“ఇందులో ప్లాన్ ఏముంది? ఇల్లు అమ్మడం ఇష్టంలేదని నాన్న చెప్పాడు. కాదనే హక్కు నాకెక్కడిది?” అన్నాడు.‘బుద్ధావతారం!’ అనుకుంది.భార్యముఖం మాడిపోవడం చూసి.. “నువ్వేమీ నిరుత్సాహపడకు. అమ్మతో కూడా మాట్లాడుతాను” చెప్పాడు.“మీ నాన్నమాట మీ అమ్మ అంగుళం కూడా జవదాటదు..” అంది.“అదేం లేదు.. అమ్మ నా మాట వింటుంది” చెప్పాడు ధీమాగా.“చూద్దాం”.. అంది తలెగరేస్తూ.తండ్రి బయటికి వెళ్లడం చూసి.. తల్లిని కదిలించాడు సూర్యనారాయణ. కొడుకువైపు ఎగాదిగా చూస్తూ.. “ఇంత విశాలమైన ఇల్లు, మంచి వాతావరణం అక్కడ దొరుకుతుందంట్రా!”.. అంది.
“అక్కడే అన్నీ దొరుకుతాయ్ మమ్మీ! ఇలా కూరగాయలకు నాన్న మార్కెట్‌కు వెళ్లనవసరం లేదు. పచారి కొట్టు సామాన్లకు కూడా వెళ్లనక్కరలేదు. అన్నీ మన దగ్గరకే వస్తాయ్” చెప్పాడు.“అక్కడ జైల్లో ఉన్నట్టు ఉంటుందిరా! మీ నాన్నకు అసలు ఊపిరి ఆడదు. ఆయనకు ఒక దగ్గర కాలూచెయ్యి ఉండవు కదా! ఇదిగో ఇప్పుడు చూడు.. కూరగాయల కోసమని వెళ్తాడా.. రెండుమూడు గంటలు స్నేహితులతో బాతాఖానీ వేసుకొని వస్తాడు. ఆయనకదో ఆనందం!” అంది.
మాట్లాడేది ఇక ఏమీలేక.. భార్య దగ్గరకొచ్చి అదే చెప్పాడు.“ఎక్స్పెక్ట్ చేశా..” అంది లహరి.భార్యవైపు అదోలా చూశాడు.“అవునండీ! నేను ఊహించినట్టే ఆమె మాట్లాడారు”.. అంది లహరి.“సర్లే! ఇక ఆలోచించకు. గేటెడ్ కమ్యూనిటీలో చేరే అదృష్టం ఇప్పటికి లేదనుకుంటాను” అన్నాడు.లహరి ఆలోచిస్తూ.. ‘మనసుంటే మార్గం ఉండకపోతుందా!?’ అనుకుంది.గేటెడ్ కమ్యూనిటీ ఆలోచన భర్తకు చెప్పింది లహరే.కొడుకు అభ్యర్థన గురించి రఘురాంకు చెప్పింది సరస్వతి.“అమ్మని రాయబారిగా పంపాడా?” అడిగాడు.“రాయబారం ఏం లేదు. వాడి మనసులో మాట చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను” అంది.
“ఏం చెప్పావు?”.“మీతో ఎందుకు చెప్తాను” అంది నవ్వుతూ.భార్యవైపు సుదీర్ఘంగా చూశాడు. చెదరని చిరునవ్వు, ఎన్నికష్టాలు వచ్చినా బెదరని ధీరత్వం.. సరస్వతికే సొంతం. సంసారం ఈదడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సహనశీలి తను. ‘క్షమయా ధరిత్రి’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తను. ఎవరినీ కోప్పడినట్టు తను చూడలేదు. ఎంతో ఓర్పు ఆమె స్వంతం. కాలం అంచుల వెంట నడుస్తూ ఇచ్చే కొండంత ఓదార్పు తనకి ఊరటనిస్తుంది. కరణేశు మంత్రిలా తానిచ్చే ప్రతి సలహా.. జీవిత పర్యంతం వరకూ వినియోగపడుతూనే ఉన్నాయి. శయణేశు రంభ అని ఎందుకన్నారో తెలీదు కానీ.. తనతో సరస్వతి గడిపిన ప్రతి నిమిషం ఒక అద్భుత ఘడియే! మధురమైన రోజే. సంపూర్ణ స్త్రీతత్వంతో తొణికిసలాడే తన భార్య సరస్వతి.. ఆరోజు కుప్పకూలినప్పుడు తనకి ఊపిరాడలేదు.
అప్పటికింకా సూర్యకి పెళ్లి కాలేదు. జాబ్‌లో చేరాడు. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లాడు. రఘురాం ఒక్కడే సరస్వతిని ఆసుప్రతికి తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు అయ్యాక.. “ఎన్నిరోజులు బతుకుతుందో చెప్పలేం” అన్నారు అక్కడి డాక్టర్లు.భార్యకు వినిపించలేదని అనుకున్నాడు రఘురాం. కానీ, తను చప్పున భర్తచేయి పట్టుకొని.. “వాడికి చెప్పకండీ..” అంది.“చెప్పకుండా ఎలా ఉండగలను సరసూ” అన్నాడు.“చెబితే వాడి గుండె తట్టుకోలేదండీ!” అంది. భార్యవంక దిగాలుగా చూశాడు. అన్నిటికీ తనపై ఆధారపడే కొడుకు ధ్యాసని మరో స్త్రీవైపు మళ్లించాలని నిర్ణయించుకొని.. “నెలలో వాడి పెళ్లి చూడాలని ఉంది” అంది.“అంత తొందరగా సంబంధం ఎక్కడ దొరుకుతుంది?” అన్నాడు.
దూరపు బంధువు లహరి గురించి చెప్పింది. తనని ఆ మధ్య ఒక పెళ్లిలో చూసిన విషయం గురించి చెప్పింది. లహరి తల్లిదండ్రుల గురించి రఘురాంకి తెలుసు. విడాకుల వరకూ వెళ్లారు వాళ్లు.“ఆ ఇంటి సంబంధం మనకెందుకు సరసూ!?” అన్నాడు.“తల్లిదండ్రుల తప్పులకు పిల్లల్ని శిక్షిస్తారా?” అంది.రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.“పిల్ల బంగారు బొమ్మలా ఉందండీ!” అని భర్తని కన్విన్స్ చేసింది.తనకి తెలిసిన సమాచారం చెబుతూ.. “వంటావార్పులో అమ్మాయి మంచి ప్రావీణ్యురాలే!” అని ప్రమోట్ చేసింది.రఘురాం ‘ఊ’ కొట్టక తప్పలేదు.
పెళ్లి విషయం చెబితే.. “నీ ఇష్టం మమ్మీ!” అన్నాడు సూర్యనారాయణ.
నెల తిరిగేసరికల్లా కొడుకు పెళ్లి చేశారు. సరస్వతి ప్రాణం గట్టిదే! నిలిచింది.“చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో ‘ఊయల’ ఊగాలని నాకు ఉండేది. అదిగో అక్కడ ఒక ఉయ్యాల నాకోసం వేయించండి” అంది.రఘురాం కాదనకుండా ఆ పని చేశాడు. ఊయల ఊగేటప్పుడు సరస్వతి కళ్లలో మెరిసే మెరుపంటే అతనికి చాలాఇష్టం. ‘ఏరికోరి కోడల్ని తెచ్చుకుంటే.. కోడలు తల కొరివిలా మారిందా?’ సరస్వతి తల విదిల్చింది.
“సరే! నువ్వు చెప్పినట్టే ఇల్లు అమ్మే ఆలోచనను వాయిదా వేద్దాం నాన్నా! కానీ”.. అని ఆగాడు సూర్య.భర్త పక్కన ఉన్న లహరి ఎంటరైపోయి.. “ఆ ఊయల కట్టిన స్థలంలో షాపుల కోసం రెండు షట్టర్ రూములు వేయిస్తే.. అద్దె వస్తుంది కదా మావయ్యా!” అంది.రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.“కావాలంటే ఊయలను పెరట్లో వేయిస్తాం” అని సలహా కూడా ఇచ్చింది.పెరట్లో ఇరుకు స్థలంలో ‘ఊయల’ ఊగడానికి.. ఇలా ఆరుబయట విశాలమైన స్థలంలో ఊగడానికి తేడా లేదా? అలల్లా తేలివచ్చే మలయ పవనం మధ్య ‘ఊయల’ ఊగడం అనే ఇష్టమైన ఆ పక్రియ సాగుతుంటే.. సరస్వతి మనసు ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకు వీళ్లకి ఈ స్థలం మీద దృష్టి మళ్లింది? ఈ ఆఖరి రోజుల్లో సరస్వతిని ఆనందపెట్టకుండా ఎలా ఉండగలడు?.. రఘురాంలో మనసులో ఇవే ఎడతెరిపిలేని ఆలోచనలు.
“నిన్న దారిలో వీరాస్వామి కన్పించాడు నాన్నా! తన సిమెంట్ వ్యాపారం కోసం బస్తాలు వేసుకోవడానికి మన ఊయల పెట్టిన స్థలంలో షాప్ రూముల్లా షెడ్ వేసిస్తే తీసుకుంటానని చెప్పాడు. అద్దెకూడా ఇరవై వేలకు పైగా ఇస్తానన్నాడు. పైగా.. రూము కట్టడానికి అయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పాడు. మనకిచ్చే అద్దెలో అతని అప్పు కట్ చేసుకొంటానని అంటున్నాడు” చెప్పాడు సూర్య నారాయణ.“ఇంతోటి స్థలానికి అంత అద్దె రావడం అంటే మాటలు కాదుకదా మావయ్యా!” అంది లహరి, వీరాస్వామి లహరికి దూరపు బంధువు కూడా. సరస్వతి వింటూ నిల్చొంది.“అందరి కళ్లూ ఈ స్థలం మీదే!” గొణుగుతూ బయటికి నడిచాడు రఘురాం.“ఆయనకి ఇష్టంలేని పనిని చేయమంటూ ఎందుకు ఫోర్సు చేస్తారు?” అంది సరస్వతి.
“మావయ్యగారి మీద ఎందుకు చెప్తారు? మీకు ఇష్టం లేదని చెప్పండి అత్తయ్యా..” అంది లహరి కోపంగా.కోడలివైపు చురుగ్గా చూసింది సరస్వతి. అదేం పట్టించుకోకుండా..“ఈయనగారి సంపాదన మీ కీమోథెరపీకి, మామయ్యగారి మందులకే సరిపోతుంది. చంద్రునికో నూలుపోగులా ఈ స్థలం ఉపయోగపడి నాలుగు డబ్బులు పోగు పడితే.. అవి మీ అబ్బాయికి వేడినీళ్లకి చన్నీళ్లలా ఉపయోగపడతాయి కదా..!” అంది లహరి.
“మీ మావయ్యకి సిమెంట్ వాసన పడదు. ఆయనకి ఆస్తమా కూడా ఉంది. సిమెంట్ గౌడౌన్ ఎలా కడతారు?” అంది సరస్వతి.“దేశంలోని అన్ని వ్యాధులు మన ఇంట్లోనే ఉన్నట్టు ఉన్నాయ్” అంది లహరి.. లోగొంతుకతో! భార్యవైపు కోపంగా చూశాడు సూర్యనారాయణ.“నామీద కారాలు-మిరియాలు నూరడం కాదు. మీ అమ్మానాన్నల దగ్గర చూపండి మీ ప్రతాపం!” అని లోనికి వెళ్లింది లహరి.“ఏం చెప్పినా కాదనే అనాలని నిర్ణయించుకున్నారా అమ్మా!?” అన్నాడు సూర్య నారాయణ.కొడుకువైపు చురుగ్గా చూసింది సరస్వతి..“లేకుంటే.. ఈ వయసులో ఊయల ఊగాలనే కోరిక ఎందుకమ్మా? ఆ జాగా ఇస్తే షాపు కోసం గదులు కట్టుకుంటాం కదా? పైగా లహరి చెప్పిన ప్లాన్కూడా బాగుంది. మొన్నామధ్య వీరాస్వామి ఇంటికి వెళ్తే.. ఆయన భార్య కూడా లహరికి ఈ సలహానే ఇచ్చిందట”. సరస్వతి కొరకొరా చూసింది.‘ఏదో.. ఇంట్లో బోరుగా ఉంది. అలా మా బంధువు వీరాస్వామి ఇంటికి వెళ్లొస్తా అత్తయ్యా!’ అంటే.. వెళ్లమని చెప్పింది. ఇలా రాయబారాలు నడుపుతుందని అనుకోలేదు.“రాత్రికి మీ నాన్నతో మాట్లాడుతాలేరా!”.. కొడుకుతో అంది సరస్వతి.
“నాది పోయే ప్రాణమేగా?! నాకోసం ఆ స్థలాన్ని ఎందుకు వృథా చేస్తారు? పిల్లాడి మాట వినండి” అంది సరస్వతి.భార్యవైపు తదేకంగా చూశాడు రఘురాం.తర్వాతి రోజు ఉదయానికే ఒక నిర్ణయానికి వచ్చి.. కొడుకూకోడలు గది దగ్గరికెళ్లి తలుపు తట్టాడు. అప్పటికింకా సరస్వతి నిద్ర లేవలేదు. “ఏంటి నాన్నా?” అని కళ్లు నలుపుకొంటూ బయటికి వచ్చాడు సూర్యనారాయణ. విడిపోయిన జుట్టు ముడి వేసుకుంటూ.. లహరి కూడా వచ్చింది.“ఏంటి మావయ్యా! అత్తయ్యకేమైనా నలతగా ఉందా?” అడిగింది.“కాదమ్మా! నాకే నలతగా ఉంది” అని కొడుకు వైపు తిరిగి..
“మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లండ్రా” అన్నాడు.పిడుగు పడ్డట్టు ఇద్దరూ అదిరిపడ్డారు.“ఏంటి నాన్నా!?” అని అడిగాడు సూర్య.“నువ్వు సరిగ్గానే విన్నావురా! నీకు జీతం వస్తుంది. అద్దె కట్టుకోలేని స్థితిలో లేవు. నేను ఇలా ఖాళీ చేయమని చెప్పిన విషయం మీ అమ్మకి చెబితే నా మీద ఒట్టే!” అని చెప్పి వెనుతిరిగాడు రఘురాం.వారం రోజుల వ్యవధిలో సూర్య ఇల్లు ఖాళీ చేశాడు.“ఇంత సడన్‌గా ఈ నిర్ణయం ఏంట్రా?” అడిగింది సరస్వతి.“కంపెనీకి దగ్గరగా ఏదో ఇల్లు చూసుకున్నాడట. వాడి కంఫర్ట్ వాడు చూసుకోవాలి కదా! పోనివ్వు సరస్వతీ” అన్నాడు రఘురాం.
లహరి ఏమీ మాట్లాడలేదు.“ఆ స్థలం వీరాస్వామికి ఇద్దాంలేరా! షాపులకి రెంట్ కూడా వస్తుంది కదా!” అంది సరస్వతి. స్థలం ఇవ్వనందుకే వెళ్తున్నాడేమో!? అనుకొని. “ఆ వచ్చే అద్దెలేవో మీరే తీసుకోండి అత్తయ్యా! మీకసలే ఒంట్లో బాగోలేదు కదా” అంది లహరి.“మంచిదమ్మా! వర్జ్యం వస్తుంది. బయలు దేరండి”.. తొందర చేశాడు రఘురాం.
సూర్య తల్లి దగ్గరికి వచ్చి.. “నువ్వేం బెంగపడకమ్మా! రెండ్రోజులకు ఒకసారి వచ్చి నిన్నూ, నాన్నని చూసుకుంటాం..” అన్నాడు. “దానిదేముంది లేరా! సిటీలోనేగా మీరుండేది. మాకు చూడాలనిపిస్తే మేమే వస్తాం. మీకు చూడాలనిపిస్తే మీరూ వద్దురు” అన్నాడు రఘురాం. కొడుకూకోడలు లగేజీతో వెళ్లి పోయాక..“మీరేమైనా బెదరగొట్టి పిల్లల్ని వెళ్లగొట్టడం లేదు కదా!” అంది సరస్వతి.“అవేం మాటలే” అన్నాడు రఘురాం.“మనస్సు బాగలేదు. ఊయల ఊపుదురు రండి” అని ఊయల దగ్గరికి వెళ్లింది సరస్వతి. నవ్వుతూ వెంట నడిచాడు రఘురాం. ముందురోజు వీరాస్వామిని కలిసి గదమాయిస్తే.. అతను పెదవి విప్పి చెప్పిన మాటలు గుర్తొచ్చాయ్ రఘురాంకి.‘నేను చేసే సిమెంట్ వ్యాపారానికి ఇప్పటికే రెండు గౌడౌన్లు ఉన్నాయి బాబాయ్. మీ స్థలం నేనేం చేసుకోను? ఇదంతా మీ కోడలు పిల్ల, మా ఆవిడా వేసిన స్కెచ్. ఆ స్థలంలో ఊయల వేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా! అది చూసి మీ కోడలు కళ్లల్లో నిప్పులు పోసుకుంది. మీతోనే ఆ ఊయల తీసేయించాలనేది మీ కోడలిగారి అంతరంగం. నిజానికి ఆ స్థలంలో షాపుల కోసం గదులు కడితే ఎవరైనా కళ్లకి అద్దుకొని తీసుకుంటారు. ఆ విషయం మీకూ తెలుసు. కానీ, ఆమె ఆనందానికి వెలగట్టగలిగే షరాబులం కాదుకదా మనం’ అన్నాడు వీరాస్వామి. సరస్వతికి ఉన్న అనారోగ్యం వీరాస్వామికి తెలుసు.“కూర్చొని పది నిమిషాలు అయింది. ఊపరే..” అంది సరస్వతి.“కాస్త ఉండవే!” అన్నాడు రఘురాం.. తన లుంగీ సర్దుకుంటూ.
తటవర్తి నాగేశ్వరి
తటవర్తి నాగేశ్వరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవరం. ఎంఏ (తెలుగు లిటచరేచర్) చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. 2012 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ.. ‘తదనంతరం’. ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వీక్లీలో ప్రచురితమైంది. ‘దాడి’ కథ.. రమ్యభారతి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి దక్కించుకున్నది. శ్రీకళ్లేపల్లి వెంకటశాస్త్రి శత జయంతి పురస్కార కథల పోటీలో ‘నవ్వు నవ్వించు’ కథకు బహుమతి అందుకున్నారు. మొదటి నవల ‘మమజీవన హేతునా’.. ‘స్వాతి’ మాస పత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో సంధ్యారాగం, సత్యభామ, గురి, అమ్మరుణం, అమ్మకోసం కథలు, కల్కి, ప్రేమలు, ప్రేమాయణమః నవలలు బహుమతులు అందుకున్నాయి. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం నిర్వహించిన కథల పోటీలలో బహుమతి రావడం ఇది మూడోసారి. ఇంతకుముందు హనీ, రోహిణి ఐఏఎస్ కథలకు బహుమతులు గెలుచుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-తటవర్తి నాగేశ్వరి
99897 73549