ప్రతి ఒక్కరికీ ఇంటిపేరు ఉంటుంది. దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. తమ ఇంటి పేరును నిలబెడతారని వంశోద్ధారకులపై పెద్దలు ఆశలు పెంచుకుంటారు. ఇక ఇంటిపేరుతో గుర్తింపు పొందాలనే కోరిక చాలామందికి సహజమే.అందరిలాగే అతనూ ఇంటిపేరుతోనే వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ, తన ఇంటిపేరుతో కాదు. తనకు స్ఫూర్తిగా నిలిచినవారి ఇంటిపేరుతో! అదే.. ‘కోటక్ మహీంద్రా బ్యాంక్’! మనదేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్!
ఇంటిపేర్లతోనే సరికొత్త ‘బ్రాండ్‌నేమ్’ సృష్టించుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. వేరేవారి ఇంటిపేరుతో వ్యాపారంలోకి అడుగుపెట్టడం నిజంగానే ఓ సాహసం. భారతీయ వ్యాపార రంగంలోనే ఇదో విచిత్రం. ‘కోటక్ మహీంద్రా’కు తప్ప.. బహుశా వేరే ఏ సంస్థకూ ఇలాంటి ప్రత్యేకత లేదు. కంపెనీ తమదైనా.. వేరేవాళ్ల ఇంటిపేరుతో నిర్వహిస్తున్న ఈ బ్యాంకు కథలోకి వెళ్తే..
భారతీయ వ్యాపార జగత్తులో ‘మహీంద్రా’లది తిరుగులేని పేరు. మోటార్ వాహనాల తయారీలో ‘మహీంద్రా అండ్ మహీంద్రా’, టెక్ రంగంలో ‘టెక్ మహీంద్రా’.. ఇలా చెప్పుకొంటూ పోతే దాదాపు అన్ని రంగాల్లోనూ వీరు దూసుకెళ్తున్నారు. ‘మహీంద్రా’ అనేది.. ఆ సంస్థ వ్యవస్థాపకులైన జగదీష్ చంద్ర మహీంద్రా, కైలాష్ చంద్ర మహీంద్రాల ఇంటిపేరు. ప్రస్తుతం దేశంలోని ప్రైవేటు బ్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న ‘కోటక్ మహీంద్రా బ్యాంక్’లోని ‘మహీంద్రా’ కూడా వీరి పేరులోనిదే! కానీ, ఆ బ్యాంకు మాత్రం మహీంద్రాలది కాదు. దీని వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్. వీరి కుటుంబం కాటన్ వ్యాపారం చేసేది. ఉదయ్ కోటక్‌కు క్రికెట్ అంటే పిచ్చి. యూనివర్సిటీ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. ఆటలో గాయపడటం వల్ల క్రికెట్‌ను వదిలేశాడు. లేకపోతే భారత క్రికెట్ జట్టులో స్థానం పొందేవాడని అతని ఆటను చూసినవాళ్లంతా అంటారు.
ఉదయ్ సురేష్ కోటక్.. 1959 మార్చి 15న ముంబయిలోని గుజరాతీ వ్యాపారుల కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం ‘కోటక్ అండ్ కో’ పేరుతో పత్తితోపాటు ఇతర కమోడిటీ వ్యాపారం నిర్వహించేది. ఇక ముంబయి యూనివర్సిటీ నుంచి బీకాం చేసిన ఉదయ్ కోటక్.. కుటుంబ వ్యాపారం కాకుండా ఏదైనా సొంతంగానే చేయాలి అనుకునేవాడు. ఎంబీఏ తరువాత కొన్నిరోజులపాటు ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. 1985లో 26 ఏళ్ల వయసులో కుటుంబ వ్యాపారాన్ని వదిలేసి.. ‘కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రాకు మేనేజర్‌గా ఉన్న ఆనంద్ మహీంద్రాను కలిశాడు. బ్యాంకును ఏర్పాటు చేయాలనే తన ఆలోచనను పంచుకున్నాడు. వ్యాపార రంగంలో మహీంద్రాలే తనకు స్ఫూర్తి అని, ఆ పేరును వాడుకొనే అవకాశం ఇవ్వాలని కోరాడు. ఉదయ్ సురేష్ కోటక్ వ్యాపార ఆలోచనలు కూడా ఆనంద్ మహీంద్రాకు నచ్చాయి. దాంతో, అతన్ని నమ్మి కొంత పెట్టుబడి పెట్టడంతోపాటు ‘మహీంద్రా’ పేరును కూడా వాడుకొనే అవకాశం ఇచ్చాడు ఆనంద్ మహీంద్రా.
‘పేరు’పై నమ్మకం..తన ఇంటిపేరైన ‘కోటక్’ కన్నా.. ‘మహీంద్రా’ పేరుతోనే మార్కెట్లోకి వెళ్లాలని ఉదయ్ భావించాడు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ‘మహీంద్రా’ పేరుపై నమ్మకంతో ఎక్కువమంది ఖాతాదారులు వస్తారని అనుకున్నాడు. అతని ఆలోచనే నిజమైంది. 1986లో నాలుగు లక్షల పెట్టుబడితో ‘కోటక్ మహీంద్రా ఫైనాన్స్’ సంస్థను ప్రారంభించాడు. 1990లో స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్.. ఇలా రకరకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు ఉదయ్ కోటక్. 1995లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకీ ప్రవేశించాడు. ఆర్బీఐ అనుమతి లభించడంతో 2003లో ‘కోటక్ మహీంద్రా బ్యాంకు’ స్థాపించాడు. మహీంద్రా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్‌గా మలిచాడు.
ఎవరి అండా లేకుండా..ఏ వ్యాపారానికైనా ఆలోచనలతోపాటు ‘విజన్, నమ్మకం’ కూడా ముఖ్యమేనని చెబుతాడు ఉదయ్. అయితే, తాను వ్యాపారంలోకి అడుగు పెట్టిన కొత్తలో.. చాలామంది వద్దని వారించారట. రాజకీయ సహాయం, ఇంటి పేరు, కుటుంబ వ్యాపారం అండా లేకుండా.. బ్యాంకును నడిపించడం సాధ్యం కాదని హెచ్చరించారట. అయితే, అవేవీ లేకుండానే బ్యాంకింగ్ వ్యాపారంలో విజయం సాధించి చూపాడు ఉదయ్ కోటక్. మిత్రులు, బంధువులు కొద్దిపాటి ఆర్థిక అండ అందించడంతో.. వ్యాపారాన్ని ముందుకు నడిపించాడు. తన ఆలోచనలకు ‘మహీంద్రా’ ఇంటి పేరు కూడా తోడవ్వడంతో.. బ్యాంకు వ్యాపారం మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్ధిల్లింది. ప్రస్తుతం 4.30 లక్షల కోట్ల రూపాయల సంస్థగా ఎదిగింది. 2024 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారత దేశంలోని 100 మంది సంపన్నుల జాబితాలో ఉదయ్ కోటక్ 18వ స్థానంలో ఉన్నాడు. తన వ్యక్తిగత ఆస్తి విలువే.. 1.18 లక్షల కోట్లుగా ప్రకటించాడు. 60 మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం వీరిది. దీనిని ఆయన ‘క్యాపిటలిజం ఎట్ వర్క్ అండ్ సోషలిజం ఎట్ హోమ్’ అంటూ చమత్కరిస్తాడు. 2023లో కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. సామాజిక సేవలోనూ తన సంస్థను భాగస్వామిగా చేశాడు. ‘కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ను స్థాపించాడు. నిరుపేదలకు విద్య, వైద్యం కోసం మద్దతు అందిస్తున్నాడు.
-బుద్దా మురళి
98499 98087