Tejpratap Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబంలో చీలికలు ఏర్పడిన నేపథ్యంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన కుటుంబ పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు. తన సోదరుడు తేజస్వి యాదవ్ సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ద్రోహుల వల్ల తమ తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసిందని, ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కుట్రపూరితంగా ముఖస్తుతి చేసేవారి కోసం ఆర్జేడీని బలమైన పార్టీగా మార్చడానికి ఎన్నోఏళ్లుగా కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని విమర్శించారు. దురాశ, అహంకారంతో విర్రవీగుతున్న తేజస్వీ సహాయకులు నా తల్లిదండ్రులు లాలూ ప్రసాద్, రబ్రీదేవిలను వేదనకు గురిచేస్తున్నట్లు తెలిసింది. నా తండ్రి ఇప్పటికే అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేరని అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని తాను ప్రధాని మోదీని, బీహార్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని చెప్పారు.
కాగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని లాలూప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య ఇటీవల ప్రకటించారు. ఆర్జేడీ ఎంపీ సంజయ్యాదవ్, తేజస్వీ మిత్రుడు రమీజ్ఖాన్ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అనంతరం లాలూ మరో ముగ్గురు కుమార్తెలు కూడా పట్నాలోని ఆయన ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తేజస్వీ సహాయకులే కారణమని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపిస్తున్నారు.
కాగా ఇదే విషయంపై లాలూ ప్రసాద్ యాదవ్ కూడా స్పందించారు. తమ కుటుంబంలోని అంతర్గత విబేధాలను తాను పరిష్కరించుకోగలనని చెప్పారు.