నర్సంపేట/నెక్కొండ/నర్సింహులపేట//కరీంనగర్ రూరల్/మానకొండూర్, జనవరి 3: యాసంగిలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో ఇదే సమస్య ఏర్పడినా గుణపాఠం నేర్వని కాంగ్రెస్ సర్కారు.. రైతులను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలోని యూరియా గోదాము సమీపంలోని పల్లె దవాఖాన వద్ద టోకెన్ల కోసం 300 మంది రైతులు క్యూలో నిల్చున్నారు. అంతకుముందే చెప్పులను లైన్ లో పెట్టి గంటల తరబడి వేచిచూశారు. కోడికూతకు ముందే చలిని లెక్కచేయకుండా మహిళలు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు అధికారులు వచ్చి టోకెన్లు అందించారు. ఎకరానికి బస్తా చొప్పుననే పంపిణీ చేశారు.

సగం మందికి యూరియా అందలేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి సొసైటీని కలెక్టర్ సత్యశారద సందర్శించి రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ అధికారులు ఒకే కౌంటర్ ద్వారా టోకెన్లు పంపిణీ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. ఒక రైతు తన ఇంటి నుంచి ఎన్ని కార్డులు తీసుకొస్తే అన్ని యూరియా బస్తాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీష శనివారం యూరియా బస్తాల కోసం ధర్మారంలో గంట సేపు క్యూలో నిల్చున్నారు. కరీంనగర్ మండలం దుర్శేడ్‌లోని సొసైటీ, చెర్లభూత్కూర్‌లోని సొసైటీ గోదాముల వద్ద యూరియా కోసం రైతులు రోజంతా వేచిచూశారు. మానకొండూర్‌లోని విశాల సహకార పరపతి సంఘం వద్ద ఎకరానికి బస్తా చొప్పున పంపిణీ చేశారు. పదెకరాలు ఉన్న రైతులకు 6 బస్తాలు మాత్రమే ఇచ్చారు.

నాకు ఎకరం 2 గుంటల భూమి ఉన్నది. ఎస్పీపీ 9192 యూరియా కార్డు ఉన్నది. యూరియా కోసం పెద్దనాగారం రైతు వేదిక వద్దకు వెళ్తే 2 బస్తాలకు రూ. 560 తీసుకున్నారు. నా సెల్‌ఫోన్‌కు 20 బస్తాలు తీసుకున్నట్టు రూ.5,330 చెల్లించినట్టు మెసేజ్ వచ్చింది. అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్తున్నరు. ఆన్లైన్లో 20 బస్తాలు ఇచ్చినట్టు ఉంటే రెండో దఫాకు యూరియా ఇస్తరో.. ఇవ్వరో తెలుస్తలేదు. ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడ్తున్నం.
– నరేశ్, రైతు వస్రంతండా, మహబూబాబాద్ జిల్లా