Encounter : ముఖానికి బర్త్‌డే కేక్ (Birthday Cake) పూశారనే కోపంతో ఓ వ్యక్తి మరికొందరితో కలిసి ముగ్గురు బంధువులను హత్యచేశాడు. ఆపై పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బులంద్‌షహర్ (Buland Shahar) లో ఏప్రిల్ 25న ఈ ఘటన జరిగింది. ఈ త్రిపుల్ మర్డర్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి నిందితుడి కోసం వెతుకుతున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జీతూ సైనీ (Jeetu Saini) ఇవాళ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులకు పోలీసులు ఆగమని చెప్పారు. అయితే వారు ఆగకుండా పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఝాజర్ రోడ్డులో చుట్టుముట్టగా.. నిందితులు కాల్పులు కొనసాగించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక నిందితుడు తీవ్రంగా గాయపడగా.. మరో వ్యక్తి చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హతుడు మూడు హత్యలు చేసి పరారీలో ఉన్న జీతూ సైనీగా పోలీసులు గుర్తించారు.
నిందితులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి ఒక .32 బోర్ పిస్టల్, బుల్లెట్లు, నంబర్ ప్లేట్ లేని స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 25న ఖుర్జాలో జరిగిన పుట్టినరోజు వేడుకలో అమర్దీప్ (30), మనీశ్ (28), ఆకాశ్ (18) అనే ముగ్గురు కుటుంబ సభ్యులను జీతూ సైనీ కాల్చిచంపాడు. జీతూ సైనీ ముఖానికి మృతులు సరదాగా కేక్ పూయడమే ఈ ఘటనకు కారణమైంది. కాగా పోలీసుల చర్యపై మృతుల కుటుంబసభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుల ఆస్తులను ధ్వంసం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.