బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 32-34తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడింది. తాజా సీజన్లో టైటాన్స్‌కు ఇది 13వ పరాజయం కాగా.. ఒకే ఒక్క మ్యాచ్‌లో నెగ్గిన తెలుగు జట్టు 27 పాయింట్లతో పట్టిక అట్టడుగున కొనసాగుతున్నది. టైటాన్స్ తరఫున రజనీశ్ 10 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 41-39తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ (10 పాయింట్లు), సురేందర్ గిల్ (13 పాయింట్లు) రాణించడంతో ఉత్కంఠ పోరులో యూపీని విజయం వరించింది. గురువారం జరుగనున్న మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ, పుణెరీ పల్టన్‌తో పట్నా పైరెట్స్ తలపడనున్నాయి.