యాదాద్రి, డిసెంబర్10 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఊంజల్ సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త, తనను కొలిచిన వారికి తానున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం నిర్వహించారు. బాలాలయం ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్జిత పూజల కోలాహలం..
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి రూ. 18,93,248 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.