అచ్చంపేటరూరల్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ( BC Reservations ) అమలు విషయంలో కేంద్ర మంత్రులు ( Union Ministers ) కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ( CPM Johnwesly ) డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకువచ్చిన అర్డినెన్స్ను కేంద్రానికి పంపిందని తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అర్డినెన్స్ ఆమోదానికి మోదీ నాయకత్వంలోని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో ఇద్దరు మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్ పెంచుకునే అవకాశం మోదీ ప్రభుత్వం కల్పించినప్పుడు తెలంగాణలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను మోదీ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నించారు. పహల్గాం దాడి అనంతరం పాకిస్తాన్‌పై చేసిన దాడిని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారని అన్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపంలో రైతులకు అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్ ,రాష్ట్ర నాయకులు ఆర్ వెంకట్ రాములు, ఎం ధర్మానాయక్, జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, నాగరాజు, మండల కార్యదర్శి సైదులు, సయ్యద్, నిర్మల రాములు, శివకుమార్, బక్కయ్య ,వెంకటయ్య, ఆంజనేయ, రవి, తదితరులు ఉన్నారు.