కర్హాల్‌లో ఎస్పీ సింగ్ బఘేల్ నామినేషన్
యూపీ ఎన్నికలు వచ్చే శతాబ్ధపు దేశ చరిత్రను లిఖిస్తాయ్: అఖిలేశ్
మెయిన్‌పురి, జనవరి 31: యూపీలో కర్హాల్ నియోజకవర్గంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎస్పీ సింగ్ బఘేల్ సోమవారం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశ్ నామినేషన్ వేసిన కొన్ని నిమిషాల తర్వాతనే బఘేల్ నామినేషన్ వేయడం గమనార్హం. బఘేల్ ప్రస్తుతం యూపీలోని ఆగ్రా ఎంపీగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.
కర్హాల్ స్థానానికి అఖిలేశ్ నామినేషన్
ఉత్తరప్రదేశ్‌లో మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో త్వరలో జరుగబోవు అసెంబ్లీ ఎన్నికలు దేశ వచ్చే శతాబ్ధపు చరిత్రను లిఖిస్తాయని అఖిలేశ్ నామినేషన్ దాఖలుకు ముందు ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రగతిశీల ఆలోచనతో కూడిన సానుకూల రాజకీయమే తన ‘మిషన్’ అని, ఇందులో పాలుపంచుకొవాలని, ప్రతికూల రాజకీయాలను ఓడించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మెయిన్‌పురి జిల్లాల్లో మూడో దశలో భాగంగా ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. 2002లో మినహా 1993 నుంచి కర్హాల్ స్థానం ఎస్పీకి కంచుకోటగా ఉన్నది.
ఎస్పీలోకి బీజేపీ ఎంపీ కుమారుడు?
బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్‌కు లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించినట్టు సమాచారం. దీంతో ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగింపు
ఫిబ్రవరి 11వరకు పొడిగించిన ఈసీ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో పలు రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో పాదయాత్రలు, ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. దేశంలో కరోనా పరిస్థితి, ఎన్నికల భౌతిక ప్రచారంపై సోమవారం సీఈసీ సమీక్ష నిర్వహించింది. ఇంటింటికీ ప్రచారం సమయంలో 20 మందికి మించి కార్యకర్తలు ఉండకూడదని షరతు విధించింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నిర్దేశిత ఖాళీ స్థలాల్లో వెయ్యి మందికి మించకుండా ప్రజలు పాల్గొనేలా లేదా ప్రాంతం కెపాసిటీ 50 శాతం మించకుండా పాల్గొనేలా బహిరంగ సభ ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. కరోనా కట్టడికి జనవరి 8న ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్‌లోకి మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే
మణిపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే శరత్చంద్ర కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ సీనియర్ నేతలు ఎన్.బీరేన్, జాయ్‌కుమార్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శరత్చంద్ర మోయిరంగ్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పృథ్వీరాజ్ బీజేపీలో చేరడంతో ఆయనకు అదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన శరత్చంద్ర కాంగ్రెస్‌లో చేరారు.
94 ఏండ్ల వయసులో ఎన్నికల బరిలోకి బాదల్
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్‌కు చెందిన కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ (94) పంజాబ్ ఎన్నికల్లో లంబీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశంలోనే పోటీలో నిలువనున్న అత్యధిక వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆయన 2018 ఎన్నికల్లో 92 ఏండ్ల వయసులో పోటీ చేశారు. కాగా, మాజీ సీఎం అమరిందర్ సింగ్ కూడా పటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.