Piyush Goyal | ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడే అని అన్నారు. వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదే అని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు.. భారత దేశ అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారని తెలిపారు.
వైజాగ్‌లో జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ తొలి రోజు సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోయెల్ మాట్లాడుతూ.. గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా వైజాగ్ నిలుస్తోందని అన్నారు. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి సుసంప్ననమైన దేశంగా భారత్ అవతరిస్తుందని, టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని చెప్పారు. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నామని తెలిపారు.
భారత్ తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయని పీయూష్ గోయెల్ తెలిపారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉందన్నారు. అత్యంత పారదర్శకమైన విధానంలో వాణిజ్యం ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావడం అభినందనీయమని అన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.\