హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వానకాలంలో వర్షాలు మస్తుగ పడ్డాయి.. మంచి పంటలు తీయొచ్చు అని రైతులు ఆశపడ్డారు. అనుకొన్నట్టే పంటలు కూడా బాగానే పండాయి. ఇక కోతల టైం వచ్చిందనుకొని గుండెల మీద చెయ్యేసుకొన్నారు. కానీ, చెడగొట్టు వానలు కొన్నిచోట్ల రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ నెలలోనే 11వ తేదీ నుంచి 22 వరకు 12 రోజుల పాటు విరామం లేకుండా కురిసి, పంట నష్టాలను మిగిల్చాయి. జూన్ నుంచి సెప్టెంబర్ (వానకాలం సీజన్) వరకు 99 రోజుల పాటు భారీ వర్షాలు, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 4 వరకు నిరంతరాయంగా, అక్టోబర్ మొదట్లో నాలుగు రోజులు, 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణలో కురిశాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి కానీ ఈ ఏడాది దీపావళి తర్వాత కూడా నిరంతరాయంగా పడ్డాయి.
ఈ ఏడాది వర్షకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగాళాఖాతంలో 14 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఇందులో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 11, అక్టోబర్, నవంబర్‌లో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. సరాసరిన సీజన్లో వారానికొక అల్పపీడనం ఏర్పడినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ నెల చివరివారంలోనూ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. గత పదేండ్లలో ఒక సీజన్లో ఇన్ని అల్పపీడనాలు ఏర్పడటం ఇదే తొలిసారని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగి, సముద్ర జలాలు వేడెక్కుతూ వాతావరణంపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పా రు. హిందూ మహాసముద్రంలో ఓషన్ డైపోల్ కండిషన్స్ నెగెటివ్‌గా ఉండటంతో సముద్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువై, అల్పపీడన ఫ్రీక్వెన్సీ పెరిగిందన్నారు.
అల్పపీడనానికి తోడుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై బలంగా ఉండటంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 64 రోజులు భారీ వర్షాలు కురువగా, 28 రోజులు అతి భారీ వర్షాలు, 5 రోజులు అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. భారీఎత్తున కురిసిన వర్షాలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దానికితోడు రాష్ట్రంలో నీటి నిల్వలు పెరిగి మబ్బులను ఆకర్షించి భారీ వర్షాలు కురిశాయని నాగరత్న వెల్లడించారు. ఇక, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం అక్టోబర్ మొదటి వారంలోనే పూర్తికావాల్సి ఉన్నా, 10-15 రోజులు ఆలస్యంగా అక్టోబర్ 23న పూర్తయింది. దాని ప్రభావం తెలంగాణపై ఎక్కువగానే పడింది.
ఏం వానలు.. ఏం వానలు.. సమయం లేదు, సందర్భం లేదు, కాలంతో సంబంధమే లేదు అన్నట్టు కురిసినయ్. పంట చేతికి వస్తుందిగ! అనుకున్న తరుణంలో ఆ వానలు రైతుల ఆశల్ని చెడగొట్టినయ్. పంటలను ముంచెత్తి నష్టాలను మిగిల్చినయ్. పదేండ్లలోనే భారీగా, అతి భారీగా కురిసి కొత్త రికార్డు నెలకొల్పినయ్. ఇది చలికాలం కాదు వానకాలమే అన్నట్టు ఏకధాటిగా వర్షాలు పడ్డయ్. నాలుగు నెలల్లో 14 అల్పపీడనాలు ఏర్పడ్డయ్.. అంటే సగటున వారానికో అల్పపీడనం ఏర్పడిందన్న మాట.
మిషన్ కాకతీయ ద్వారా ప్రతి వాన బొట్టును ఒడిసిపట్టటంతో చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తి పోసి రిజర్వాయర్లు నింపారు. నడి వేసవిలోనూ నీళ్లను పారించారు. దీంతో భూగర్భజలాలు పెరిగాయి, జలాశయాలు నిండుకుండలా మారాయి. బీటలు వారిన పొలాలన్నీ పచ్చగా మారాయి. పచ్చదనం పెరిగింది. హరితహారం కూడా తోడవటంతో రాష్ట్రంలో వాతావరణ సమతుల్యత పెరిగింది. భూతాపం చల్లారి చల్లని తెలంగాణగా మారింది. మైక్రో సర్క్యులేషన్ పెరిగింది. ఈ మార్పులతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. మేఘాలను ఆకర్షిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశం కూడా ముందుకు జరుగుతున్నది. ఈ ఏడాది జూన్ 5నే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించటం గమనార్హం. ఫలితంగా సముద్రంలో జరిగే వాతావరణమార్పులతో ఏ ద్రోణి వచ్చినా తెలంగాణ ఆకర్షితమవుతుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు.