ఎల్బీనగర్/చిక్కడపల్లి, జూలై 21: నిరుద్యోగులు, విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో నిరసిస్తున్నది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు అమలుచేయని వైనంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఢిల్లీలో నీట్‌పేపర్ లీకేజీపై జరుగుతున్న విద్యార్థుల పోరాటంపై తల్లి ప్రేమను చూపిన రాహుల్‌గాంధీ.. తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సవతితల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు స్వయంగా ఇచ్చిన హామీలను విస్మరించారని, రెండున్నరేండ్లు దాటినా తన సొంతపార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేక మిన్నకుండిపోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ లైబ్రరీ సాక్షిగా, ప్రియాంకాగాంధీ సరూర్‌నగర్ స్టేడియం సాక్షిగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారని, కానీ, ఆ హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
తెలంగాణ నిరుద్యోగులపై రాహుల్‌గాంధీ సవతితల్లి ప్రేమ చూ పుతున్నారు. నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఆ తర్వాత పట్టించుకోవడమే లేదు. ఢిల్లీలో సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే తమ నిరసన కార్యక్రమాల వద్దకు రావద్దని ఎంతగా అంటున్నా.. వారికి మద్దతుగా రాహుల్ ఆందోళనకు దిగారు. రాష్ట్ర నిరుద్యోగుల వేదనను మాత్రం అర్థం చేసుకోవడం లేదు. సీజేపీ ధర్నాలు కనబడుతున్నాయి కానీ రెండున్నరేండ్లుగా తాము చేస్తున్న నిరసనలు, ధర్నాలు కన్పించడం లేదా? మ్యానిఫెస్టోలో పెట్టినట్టు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. చిత్తశుద్ధి ఉంటే రాహుల్ దిల్‌సుఖ్‌నగర్‌కు రావాలి. నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి.
– ఇంద్రానాయక్ , నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత
ఢిల్లీ పార్లమెంట్‌ను ముట్టడించడానికి ప్రయత్నించిన సీజేపీ కార్యకర్తలను, విద్యార్థులను పరామర్శించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో మాపై లాఠీచార్జీ జరిగినప్పుడు ఎందుకు స్పదించలేదు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్.. అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఆ హామీలను అమలే చేయలేదు. ఆ హామీల అమలకు నిరుద్యోగులు ఇక్కడ నిరసనలు చేస్తే అరెస్టులు, లాఠీచార్జీలు చేశారు. కానీ రాహుల్‌గాంధీకి మా బాధలు కన్పించడమే లేదు.
– దామోదర్‌రెడ్డి, నిరుద్యోగి
మీరిచ్చిన హామీలను అమలుచేయాలని రాష్ట్రంలో ఆందోళన చే స్తున్న నిరుద్యోగులపై మీ కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ చేస్తున్న ది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు మద్దతిచ్చిన మీరు.. స్వయంగా మీరే వచ్చి ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఇక్కడి మీ ప్రభుత్వానికి చెప్పలేరా? మాపై లాఠీచార్జీలు, అరెస్టులు జరుగుతుంటే పట్టించుకోరా? ఇక్కడి నిరుద్యోగత యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా పోలీసులతో అక్రమ కేసులు పెడుతున్నా ఎందుకు స్పందించరు. ఇప్పటికైనా మా నిరుద్యోగుల సమస్యలు తీర్చండి.
– శంకర్‌నాయక్, నిరుద్యోగ జేఏసీ నేత
తెలంగాణ నిరుద్యోగులకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి. అ శోక్నగర్ లైబ్రరీ వద్ద చాయ్ తాగుతూ 2లక్ష ల ఉద్యోగాలకు ఆయ న హామీ ఇచ్చి నెరవే ర్చలేదు. ఢిల్లీలో సీజేపీ ఉద్యమం కన్పిస్తుం ది కానీ, మా ఉద్యమం కన్పించడం లేదా ? పోలీసులు మాపై లాఠీచార్జి చేస్తూ దౌర్జన్యం చేస్తుంటే.. నిరుద్యోగులపై దమనకాండ వద్దని ఈ ప్రభుత్వానికి చెప్పలేరా?
– భూక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు తీ ర్చడం లేదని ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా రాహుల్, ప్రి యాంకాగాంధీలు ఏ నాడూ స్పందించలేదు. ఆందోళనలకు దిగి న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ని ర్బంధం విధిస్తూ అక్రమంగా కేసులు పెడు తూ వేధిస్తున్నది. అయినా ఈ చర్యలపై రాహుల్‌గాంధీ ఏ రోజూ మాట్లాలేదు. ఇప్పటికైనా చొరవ చూపాలి.
– సురేశ్, నిరుద్యోగి
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అయినా.. ఆ పార్టీ నేతలది రెండు నాల్కల ధోరణి. దేశంలో నీట్ పేపర్ లీకయితే ఆ పార్టీ నాయకులకు విద్యార్థుల బాధ కన్పిస్తున్నది. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని ప్రసంగాలు చేస్తారు. కానీ, తెలంగాణలో వేలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రెండేండ్లుగా పోరాడుతుంటే ఇదే కాంగ్రెస్‌కు మా ఆవేదన కన్పించడం లేదా? ఢిల్లీలో విద్యార్థులు నిరసన చేస్తే అది ప్రజాస్వామ్యం.. అదే నిరసనలు తెలంగాణలో చేస్తే కానరావా? తెలంగాణలో ప్రశ్నిస్తే అరెస్టులు, లాఠీచార్జీలు, గొంతునొక్కడాలు చేస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థులు కాదా? తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని లేదా? దేశంలో రాష్ట్రం మారితే కాంగ్రెస్ పార్టీ వైఖరి మారుతుందా? ఇప్పటికైనా నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.
– సింధూరెడ్డి, నిరుద్యోగ జేఏసీ నాయకురాలు