హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించిన కేసులో అడ్డంగా దొరికిపోయిన డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డిని ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు భయపడుతున్నారు. అవినీతితో రూ.300 కోట్లకుపైగా సంపాదించిన ఆయనను కస్టడీలోకి తీసుకోవాలంటేనే వణికిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు, పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో వ్యాపార సంబంధాలున్న ఆయనను ప్రశ్నిస్తే ఎంతమంది బిగ్షాట్లు బయటకు వస్తారోనన్న భయమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. భీంరెడ్డి అరెస్టు జరిగి ఇప్పటికే 15 రోజులు దాటింది. ఈ నెల 6న భీంరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. ఆ మరుసటి రోజు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నాటి నుంచి ఆయన చంచల్గూడ జైలులో ఉన్నాడు. జ్యుడీషియల్ రిమాండ్ ముగిసేలోగా భీంరెడ్డిని ఏసీబీ తమ కస్టడీకి తీసుకోకపోతే ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
సాధారణంగా ట్రాప్ కేసులు, అక్రమాస్తుల కేసులు, కుట్ర కోణం ఉన్న కేసుల్లో నిందితుడిని ఏసీబీ అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాక అదే వారం లో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. కస్టోడియల్ విచారణలో రాబట్టిన సమాచారం ఆధారంగా ఇతర నిందితులు, బినామీల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలపై లోతైన విచారణ నిర్వహించడం, అవసరమైతే వారి ఇండ్లలో సోదాలు చేపట్టడం ఆనవాయితీ. కానీ, భీంరెడ్డి విషయంలో ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టినట్టు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ కేసులో సీజ్ చేసిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, ఇతర వ్యక్తులతో భీంరెడ్డికి ఉన్న సంబంధాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలంటే ఆయనను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం అత్యంత కీలకం. అయినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సీఎంవో స్థాయిలో భీంరెడ్డికి ఉన్న పరిచయాల వల్లే ఏసీబీ ఆయనను కస్టడీలోకి తీసుకోవడంలేదని స్పష్టమవుతున్నది.
గతంలో అవినీతికి పాల్పడిన చిన్నస్థాయి ఉద్యోగుల కేసుల్లో ఏసీబీ వేగంగా స్పందించింది. వారిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన వెంటనే కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. తద్వారా లభించిన సమాచారం ఆధారంగా మరిన్ని సోదాలు చేపట్టి ఇతర నిందితులపై చర్యలు చేపట్టింది. ఉన్నతస్థాయి అధికారి అయిన భీంరెడ్డి విషయంలో ఆ వేగం కనిపించడం లేదు. దీంతో ‘చట్టం ముందు అందరూ సమానమే’ అనే సూత్రాన్ని ఏసీబీ అమలు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.