సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): నిన్నటిదాకా ట్రాఫిక్ చిక్కులతో కనిపించిన జంక్షన్లలో రయ్‌మంటూ వాహనాలు సాగుతున్నాయి. గంటల తరబడి అవస్థలు పడిన జనం నిమిషాల్లోనే గమ్యం చేరుతున్నారు. ఇలా ఒకటేమిటి… హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మకదారులతో నగరవాసులు ఊరట పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఏకంగా నాలుగు చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తుది పనులు చకచకా రూపుదిద్దుకుంటున్నాయి. ఎల్బీనగర్లో అండర్‌పాస్, బైరమల్గూడ ఎల్హెచ్ఎస్ వంతెన, బహుదూర్ఫుర ఫ్లై ఓవర్, తుకారం రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నాయి.
రూ. 46.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అండర్‌పాస్ వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో సివిల్ స్ట్రక్చర్ కాస్ట్ రూ. 9.28 కోట్లు వెచ్చించారు. ఈ అండర్‌పాస్ మూడు లేన్లతో 10.5 మీటర్లు వెడల్పు, మొత్తం 490 మీటర్లు పొడవు, బాక్స్ పోర్షన్ లెన్త్ 72.5 నిర్మిస్తున్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఉప్పల్, నాగోలు ప్రాంతం నుంచి ఎల్బీనగర్ మీదుగా ఓవైసీ దవాఖాన నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమం కానున్నది.
ఎల్బీనగర్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత చెక్ పెడుతూ బైరామల్‌గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ పనులకు శ్రీకారం చుట్టారు. 780 మీటర్ పొడవులో 400 మీటర్లు డక్ పోర్షన్, 12.50 మీటర్ల వెడల్పుతో దాదాపు రూ. 46.25 కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. వచ్చే నెలలో ఈ ఎల్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
బెంగుళూరు జాతీయ రహదారి నుంచి నగరంలోకి వచ్చి వెళ్లే వాహనాల్లో సగ భాగం నెహ్రూ జూపార్క్, బహదూర్‌పుర కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా వాహనాలన్నీ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బహదూర్‌పుర వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్డీపీ కింద రూ. 69 కోట్ల వ్యయం, 700మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పుతో ఇరువైపులా రాకపోకలు ఉండేట్లు వంతెన రూపుదిద్దుతున్నది.
తుకారం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి పునులను రూ.29.10కోట్లతో చేపట్టారు. లాలాగూడ రైల్వే స్టేషన్‌కు రైళ్ల రాకపోకలు తరచూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ఈ నేపథ్యంలోనే నాలుగు లేన్లతో 375 మీటర్ల పొడవులో తుకారం రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఆర్యూబీ అందుబాటులోకి రావడం ద్వారా మల్కాజ్గిరి, తార్నాక, మెట్టుగూడ, లాలాపేట సికింద్రాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.