Ground Water | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 7 (నమస్తే తెలంగాణ): ఉత్తర భారతంలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఎన్జీఆర్ఐతోపాటు పలు పరిశోధన సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏటా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం తగ్గుతుండగా.. దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్నదని తేల్చారు.
వ్యవసాయ అవసరాల కోసం విపరీతంగా భూగర్భ జలాలను తోడేయటం కూడా ఓ కారణమని వెల్లడించారు. 1951 నుంచి 2021 వరకు శాటిలైట్ డాటా, హైడ్రోలాజికల్ మాడల్ విధానంలో సేకరించిన డాటాను విశ్లేషించి భూగర్భ జలాలను లెక్కించారు. 2002-2021 నాటికే సుమారు 450 క్యూబిక్ కిలోమీటర్ల పరిమాణంలో నీటిని కోల్పోయినట్లుగా తేల్చారు.