అంటిగ్వా: అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో బుధవారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన యంగ్ ఇండియా.. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి మంచి జోరు మీద ఉన్నది. ఆరుగురు ప్రధాన ఆటగాళ్లకు కరోనా సోకినా.. ఏమాత్రం ఇబ్బంది పడకుండా లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్‌కు సెమీస్‌లో కంగారూల నుంచి అసలు సిసలు పోటీ ఎదురుకానుంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న యువ భారత్.. పాంచ్ పటాకా మోగించాలని కృతనిశ్చయంతో ఉంటే.. యంగ్‌ఇండియా జోరుకు అడ్డుకట్ట వేయాలని ఆసీస్ భావిస్తున్నది.