దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన పోరులో యువ భారత్ 90 పరుగుల తేడాతో పాక్‌పై భారీ విజయం అందుకుంది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 41.2 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. హుజైఫా ఎహసాన్(70) అర్ధసెంచరీ మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. కనిశ్క్ చౌహాన్(3/33), దీపేశ్ దేవేంద్రన్(3/16) ధాటికి పాక్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన పాక్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. అంతకుముందు హైదరాబాదీ ఆరోన్ జార్జ్(85), కనిశ్క్ చౌహాన్(46) రాణించడంతో యువ భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసింది. సయ్యమ్, సుభాన్ మూడేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకమైన కనిశ్క్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.