దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 154 పరుగుల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. యువ భారత్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యఛేదనలో యూఏఈ 34.3 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. రాజ్వర్ధన్(3/24) మూడు వికెట్లతో విజృంభించగా, సాంగ్వాన్, వికీ, కౌశల్ రెండేసి వికెట్లు తీశారు. వీరి ధాటికి యూఏఈ బ్యాటర్లు క్రీజులో సరిగ్గా నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ కై స్మిత్(45) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. టీమ్ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్ దాడికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన యూఏఈ స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది.
అంతకుముందు ఓపెనర్ హర్నుర్సింగ్(120) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ యశ్ ధల్(63) సాధికారిక అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 282/5 స్కోరు చేసింది. ఐదు పరుగులకే రఘువంశీ(2) వికెట్ కోల్పోయిన టీమ్ఇండియాను హర్నుర్, షేక్ రషీద్ ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 90 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రషీద్ నిష్క్రమించినా..యశ్‌తో కలిసి హర్నుర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరు యూఏఈ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. అలీషాన్(2/44) రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీతో జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించిన హర్నుర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.