హైదరాబాద్ : విధ్వంసకరమైన ఆటతీరుతో చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యంశీ(,Vaibhav Suryavanshi) అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీపై అనిశ్చితి నెలకొంది. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌లోని(Ireland) బెల్ఫాస్ట్లో జరగాల్సిన టీ20 సిరీస్‌కు స్థానికంగా చెలరేగిన హింసాత్మక అల్లర్లు, వలస వ్యతిరేక నిరసనల కారణంగా అంతరాయం కలగడంతో 15 ఏళ్ల వైభవ్ తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. లిస్బర్న్లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్ ఇప్పటికే రద్దు చేయబడింది.
భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ రికార్డును ఇప్పటికే అధిగమించిన సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కోసం ‘ఇండియా ఎ’ జట్టుతో బిజీగా ఉన్నాడు. ఐర్లాండ్‌లో నెలకొన్న సామాజిక అశాంతి కారణాల రీత్యా ఆదివారం జరగాల్సిన ‘ఐరిష్ సీనియర్ కప్’, ‘నేషనల్ కప్’ మ్యాచ్‌ల నిర్వహణపై తదుపరి 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితి సద్దుమణగకపోతే ఐర్లాండ్-భారత్ సిరీస్‌కు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రత అత్యంత ముఖ్యమని, పరిస్థితిని సమీక్షించి వివరాలను వెల్లడిస్తామని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ఐర్లాండ్‌లోని ఉద్రిక్త పరిస్థితులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా పర్యవేక్షిస్తున్నది. పరిస్థితి మెరుగుపడకపోతే, బెల్ఫాస్ట్ నుండి మ్యాచ్‌లను వేరే ప్రాంతానికి తరలించాలని బోర్డు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.