నేడు భారత్, పాకిస్థాన్ అమీతుమీ ఆసియా కప్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో వారం
వ్యవధిలో మరోసారి తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లు నెగ్గిన భారత్ గ్రూప్-‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచిసూపర్-4కు చేరగా.. తమ చివరి పోరులో హాంకాంగ్‌పై విజయంతోపాకిస్థాన్ ముందంజ వేసింది. గతఆదివారం రోహిత్ సేన చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ తహతహలాడుతుంటే.. అదే జోష్‌లో మరో విజయం సాధించాలని భారత్ భావిస్తున్నది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా టీవీలు ట్యూన్ చేసేయండి!
దుబాయ్: ఐసీసీ టోర్నీల్లో తప్ప పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడని టీమ్ఇండియా.. వారం వ్యవధిలో దాయాదితో రెండోసారి పోరుకు రెడీ అయింది. ఆసియా కప్ లీగ్ దశలో పాక్‌పై పైచేయి సాధించిన రోహిత్ సేన.. సూపర్-4లోనూ అదే ఊపు కొనసాగించాలని చూస్తుంటే.. దెబ్బకు దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కాచుకు కూర్చుంది. టాపార్డర్ వైఫల్యం టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో చర్చంతా అతడి చూట్టే తిరుగుతుండటంతో రోహిత్, రాహుల్ వైఫల్యం పెద్దగా వెలుగులోకి రాలేదు. వాస్తవానికి కోహ్లీ ఓ మోస్తరుగా ఆడుతున్నా.. నాయక ద్వయం రోహిత్, రాహుల్ మాత్రం చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతున్నారు. మిడిలార్డర్లో కోహ్లీతో పాటు సూర్యకుమార్, పాండ్యా రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. పాక్‌తో గత పోరులో తుది జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్‌ను కొనసాగిస్తారా.. లేక రిషబ్ పంత్‌ను తీసుకుంటారా చూడాలి.గాయంతో రవీంద్ర జడేజా దూరం కాగా.. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌కు చోటు దక్కనుంది.