– అధ్యక్షుడిగా భూక్యా ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా కొర్సా రమేష్, తాటి సువార్త
జూలూరుపాడు, ఆగస్టు 11 : ప్రజా సమస్యల పరిష్కారం, మండల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా జూలూరుపాడు మండల నూతన సర్పంచులందరూ కలిసి నూతనంగా ‘సర్పంచుల సంఘం’గా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని పది మంది సభ్యులతో ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా భూక్యా ప్రసాద్, ఉపాధ్యక్షురాలు బానోత్ సుమలత, ప్రధాన కార్యదర్శులు కొర్సా రమేష్, తాటి సువార్త, జాయింట్ కార్యదర్శులు, బానోత్ కృష్ణ, సంఘం లక్ష్మి కుమారి, కోశాధికారి గంగావత్ నవీన్, ప్రచార కార్యదర్శి భూక్యా చంద్రబాబు, గౌరవ సలహాదారులు చింతా జగన్నాధం, లాకావత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా, ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల సాధనకు, పంచాయతీల బలోపేతానికి సర్పంచుల సంఘం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.